త్వరలో జరగబోయే ప్రపంచకప్(World Cup) టోర్నీలో పాకిస్థాన్ కన్నా భారత్ జట్టే బలంగా ఉంటుందని పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ వకార్ యూనిస్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే తమ దేశం టీమ్ఇండియా కన్నా వెనుకబడి ఉందని స్పష్టం చేశాడు. మొన్న జరిగిన ఆసియా కప్ సూపర్-4 దాయాది దేశాల పోరులో 228 పరుగుల తేడాతో పాక్ ఓడిపోవడాన్నే ఇందుకు ఎగ్జాంపుల్ తీసుకోవాలన్నాడు. వరల్డ్ కప్ లో ‘మెన్ ఇన్ బ్లూ(ఇండియన్ ఆటగాళ్ల జెర్సీ)దే లీడ్ అని భావిస్తున్నా.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. గత ఆసియా కప్ ప్రదర్శన చూస్తే మీకే తెలుస్తుందని’ వకార్ అన్నాడు.
అక్టోబరు 14న అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ తలపడనున్న దృష్ట్యా పాకిస్థాన్ వెటరన్ మాటలు ఆసక్తికరంగా మారాయి. ‘రెండు జట్లు గట్టిగానే కనిపిస్తున్నా భారత్ కన్నా పాక్ వెనుకబాటులో ఉంది.. నాకు తెలుసు ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో.. అన్ని మ్యాచ్ లకు తల్లి లాంటిది భారత్-పాక్ మ్యాచ్.. ఇది జరిగేటప్పుడు ఇరు జట్లలో ఎంతటి ప్రెజర్ ఉంటుందో అందరికీ తెలిసిందే.. కానీ సొంతగడ్డపై జరుగుతున్న పోరులో తమ కంటే ప్రత్యర్థిపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.. అయితే నిలకడలేమికి తోడు గాయాల వల్ల పాక్ కష్టంగా ఉందని అన్నాడు.
నసీమ్ లేకపోవడం పెద్ద దెబ్బ
‘నసీమ్ షా దూరం కావడం పాక్ కు పెద్ద దెబ్బ.. నసీమ్ ఉంటే అఫ్రిదితో కలిసి ఇద్దరూ ప్రభావం చూపేవారు.. నసీమ్ స్థానంలో హసన్ అలీని పంపడం మంచి నిర్ణయమే అయినా ఈ సీనియర్ ను ఉన్నట్లుండి వరల్డ్ కప్ టీమ్ లో చేర్చడం వల్ల పెద్దగా ఫలితాలు ఉంటాయని ఆశించడం తప్పే అవుతుంది.. ఇక వరల్డ్ కప్ టీమ్ లను చూస్తే భారత్ లాంటి బలమైన స్పిన్నర్లు ఏ జట్టులోనూ కనిపించడం లేదు.. కుల్దీప్, జడేజాతో ఆ జట్టు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నది.. టాప్-11 మాత్రమే కాకుండా రిజర్వ్ బెంచ్ కూడా బలంగా ఉండటం టీమ్ఇండియాకు అడ్వాంటేజ్ అవుతుంది’ అని వకార్ యూనిస్ అన్నాడు.