రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి బలం చేకూర్చాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. భూత్పూర్ లో నిర్వహించే ప్రజాగర్జన సభకు ఆయన హాజరవుతున్నారు. కేంద్రం చేపట్టిన రూ.13,545 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు చేరుకోనున్న ప్రధాని.. వరంగల్-ఖమ్మం-విజయవాడ నాలుగు లైన్ల హైవే పనులను జాతికి అంకితం చేస్తారు. రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం నాలుగు లైన్ల రహదారిని సైతం మహబూబ్ నగర్ నుంచే ప్రారంభిస్తారు.
మరోవైపు వచ్చే ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించే సమయంలో కమలం పార్టీకి జోష్ కల్పించాలన్న ఉద్దేశంతో PM టూర్ కొనసాగనుంది. పాలముూరు జిల్లాలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నా.. జిల్లాలో పార్టీలో చేరికలు పెద్దగా లేవనే చెప్పాలి. రాష్ట్ర పార్టీలోకి సీనియర్ నేతలు వస్తారని ఆశించినా.. కర్ణాటక ఎన్నికల తర్వాత BJPపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని పర్యటనతో BJPకి పునర్వైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.