
హిమాలయ శిఖరాల చెంతన భూకంపం(Earth Quake) సంభవించింది. ఈ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై పడగా.. భూ ప్రకంపనల తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి భయంతో పరుగులు తీశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలు సహా ఉత్తర భారతదేశంలో పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. అయితే నేపాల్ కేంద్రంగా భూకంపం ఏర్పడినట్లు గుర్తించారు. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా రికార్డయింది. హస్తిన, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. నేపాల్ లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో ఒక నిమిషం పాటు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. పొరుగు దేశం(Neighbour Country)లో సంభవించిన భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై చూపడంతో ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భయంతో రోడ్లపైకి పరుగెత్తుకుంటూ వచ్చారు.