రాష్ట్ర ప్రభుత్వాల విధానపర నిర్ణయాల్ని అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్ సర్కారు ప్రకటించిన కులగణన(Casts Survey)పై మిగతా సమాచారాన్ని బయటపెట్టకుండా చూడాలన్న పిటిషన్ పై కోర్టు స్పందించింది. ప్రభుత్వాల విధానపర నిర్ణయాలు అడ్డుకోలేమని.. బిహార్ కుల ఆధారిత సర్వేను సమర్థిస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ సర్వే వివరాల్ని బయటపెట్టి నితీశ్ సర్కారు రూల్స్ ఉల్లంఘించిందంటూ జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ తో కూడిన బెంచ్ కు పిటిషనర్ తరఫు లాయర్ సూచించారు. ఈ పిటిషన్ పై స్పందించిన ధర్మాసనం… రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను అడ్డుకోలేమని, అలా చేస్తే తప్పిదమే అవుతుందని తేల్చిచెప్పింది. అయితే డేటాకు సంబంధించిన సమస్య ఉంటే దాన్ని పరిశీలిస్తామని, ఇలాంటి సర్వే చేపట్టడానికి రాష్ట్రానికి ఉన్న అధికారాల గురించి పరిశీలన చేస్తామని బెంచ్ భావించింది.
తాయిలాలు అడ్డుకోవాలంటూ పిటిషన్
రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే తాయిలాలు(Free Schemes) అందించే పని ప్రారంభమైందని, దీన్ని అడ్డుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. ఉచితాల విషయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటూ పిటిషనర్ ఆరోపించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ పిటిషన్ స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.