హమాస్ తీవ్రవాదులు(Hamas Militants) రెచ్చిపోయారు. ఇజ్రాయెల్(Israel) పై వరుస దాడులకు దిగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోగా… 200 మంది గాయపడ్డారు. హమాస్ సైనిక చొరబాటును ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సీరియస్ గా తీసుకున్నారు. ఇది తమ దేశంపై జరిగిన దాడి అని చెబుతూ తమ దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఘటన అని ప్రకటించారు. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్లను ప్రయోగించామని అటు హమాస్ ప్రకటించుకుంది. ‘ఆపరేషన్ -అల్-అక్సా ఫ్లడ్’ పేరిట శనివారం తెల్లవారుజాము నుంచే 5,000 రాకెట్లను ప్రయోగించామని చెప్పింది. దీనిపై పాలస్తీనా(Palestina) ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ దేశ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పాలస్తీనా ప్రజలకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఆయన చెప్పినట్లు ఆ దేశానికి చెందిన అధికారిక వార్తా సంస్థ WAFA తెలిపింది.
మా తడాఖా చూపిస్తాం
హమాస్ దాడులపై నెతన్యాహూ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇక నుంచి మా తడాఖా ఏంటో చూపిస్తాం.. దాడి పర్యవసానాల్ని ప్రత్యర్థులు అనుభవించక తప్పదు అని హెచ్చరించారు. అయితే బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఇజ్రాయెల్ చెబుతున్నది. దేశంలోని 14 వేర్వేలు ప్రదేశాల్లో 60 మంది చొరబాటుదారులు ఉన్నట్లు నిఘా వర్గాలు అంటున్నాయి. దీనిపై తమ దళాలను ఎదురుదాడికి దిగాలని ఆదేశించిన నెతన్యాహు.. శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.