పరీక్ష ఉంటుందా, ఉండదా అన్న ఊగిసలాట ధోరణి మధ్య కొనసాగుతున్న గ్రూప్-2 నిర్వహణపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. పరీక్షను వాయిదా వేయడమే మంచిదని TSPSC నిర్ణయించింది. గ్రూప్-2 నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. నవంబరు 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా.. భద్రతా కారణాల రీత్యా కష్టమన్న భావనకు అధికారులు వచ్చారు. ఎన్నికల దృష్ట్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షకు అంత అనుకూలమైన వాతావరణం ఉండబోదన్న ఆలోచనకు వచ్చారు. నవంబరు 3న ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున జనవరికి వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది.
జనవరి 6, 7 తేదీల్లో
జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష జరపుతామని TSPSC వెల్లడించింది. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల సమయంలో అన్ని ప్రాంతాలు సెక్యూరిటీ ఫోర్సెస్ తోపాటు ఎన్నికల అధికారుల(Elections Officials) చేతుల్లో ఉంటాయి. దీంతో పరీక్ష నిర్వహించాల్సిన సెంటర్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్-2 నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి TSPSC వర్గాలు వచ్చాయి.
మళ్లీ అలా కాకూడదని…
గత కొన్ని నెలల తీరును పరిశీలిస్తే TSPSC(Telangana State Public Service Commission) అభాసుపాలైంది. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయంలో అపప్రథ మూటగట్టుకోవాల్సి వచ్చింది. రెండు సార్లు ప్రిలిమ్స్ క్యాన్సిల్ కావడంతోపాటు హైకోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకోవాల్సి వచ్చింది. కోర్టుకు సమాధానం చెప్పుకోలేక నానా అవస్థలు పడ్డారు ఉన్నతాధికారులు. దీనిపై ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఇలాంటి వాతావరణంలో గ్రూప్-2ను ఛాలెంజింగ్ గా నిర్వహించడం ఒకెత్తయితే.. అది సజావుగా సాగుతుందా అలా జరగకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఉన్నతాధికారులు ముందుగానే ఊహించినట్లుంది. ఇది వాయిదా పడుతుందనే సోమవారం(అక్టోబరు 9)నుంచి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనుమానాలపై క్లారిటీ ఇస్తూ గ్రూప్-2పై ఇప్పటికిప్పుడు ముందుకు వెళ్లకపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతున్నది.