ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. బట్లర్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 364 పరుగులు చేయగా, 48.2 ఓవర్లలో 227 రన్స్ కు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. దీంతో 137 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇంగ్లిష్ జట్టులో ఓపెనర్ డేవిడ్ మలన్(140; 107 బంతుల్లో, 16×4, 5×6) సెంచరీతో కదం తొక్కాడు. జో రూట్(82; 68 బంతుల్లో, 8×4, 1×6), బెయిర్ స్టో (52; 59 బంతుల్లో, 8×4) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. బంగ్లా బౌలర్లరో మెహదీ హసన్ 4, షరీఫుల్ ఇస్లాం 3 వికెట్లు తీసుకున్నారు.
బంగ్లా టాప్ లేపిన ఇంగ్లండ్
365 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా టీమ్ లో ఓపెనర్ లిట్టన్ దాస్(76) హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో దాస్ కు అండగా నిలిచివారే కరవయ్యారు. తాంజిద్(1), నజ్ముల్(0), కెప్టెన్ షకీబ్(1), మిరాజ్(8) ఇలా వచ్చి అలా వెళ్లారు. ముష్ఫికర్(51), తౌహిద్ హృదాయ్(39) కొద్దిసేపు క్రీజులో నిలబడ్డా టెయిలెండర్లు తోక ముడిచారు. దీంతో బంగ్లా ప్రస్థానం 227 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లి 4, వోక్స్ 2 వికెట్లు తీసుకున్నారు. సెంచరీతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు కారణమైన మలన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.