రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందున ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ వాయిదా పడింది. నవంబరు 20 నుంచి 30 వరకు జరగాల్సిన TRT వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు. మొత్తం 5,089 పోస్టులకు గాను టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు(TRT) నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరు 30 నాడే పోలింగ్ ఉన్నందున పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది.
ఆన్ లైన్ విధానం(Online System)లో TRTని నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. సెప్టెంబరు 20 నుంచి ప్రారంభమైన అప్లికేషన్ల ప్రక్రియ అక్టోబరు 21 వరకు కంటిన్యూ కానుంది. పరీక్షలను కచ్చితంగా నవంబరులోనే చేపట్టాలని, లేదంటే మరో నాలుగు నెలల దాకా స్లాట్లు దొరకవని మేనేజ్మెంట్ సంస్థ అయిన TCS అయాన్ ఇంతకుముందే తెలిపింది. అదే జరిగి ఫిబ్రవరిలో గనుక పరీక్ష నిర్వహిస్తే బడులు స్టార్ట్ అయ్యే సమయానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కాదని తెలియజేసింది. ఆ అనుమానాలను నిజం చేస్తూ తాజా ఎన్నికల దృష్ట్యా TRT వాయిదా పడాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షను TSPSC వాయిదా వేసిన సంగతి తెలిసిందే.