భారత్ బ్యాటింగ్ కు, పాకిస్థాన్ బౌలింగ్ కు జరుగుతున్న యుద్ధం.. అతిపెద్ద స్టేడియంలో జరుగుతున్న అతిపెద్ద మ్యాచ్.. భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తుందా లేదా పాకిస్థాన్ చరిత్ర తిరగరాస్తుందా.. ఇదీ దాయాది దేశంతో పోరుకు ముందు జరిగిన ప్రచారం. కానీ పోరు ఏక పక్షమైంది.. ప్రత్యర్థి నుంచి కనీస పోరాటమే కరవైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.. 1.20 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించిన మ్యాచ్ లో జైత్రయాత్రను భారత్ కంటిన్యూ చేసింది. వరల్డ్ కప్ లో పాక్ చేతిలో ఓటమన్నదే లేని రికార్డును సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ దుందుడుకు బ్యాటింగ్ తో భారత్ సునాయాసం(Easy)గా గెలుపును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో ఇరు దేశాలు 8 మ్యాచ్ లాడితే అందులో ఎనిమిదింటిలోనూ టీమ్ ఇండియాదే తిరుగులేని ఆధిపత్యం.టాస్ గెలిచిన రోహిత్ శర్మ పాకిస్థాన్ కు తొలుత బ్యాటింగ్ అప్పగించాడు. ఆ జట్టు పూర్తి ఓవర్లు ఆడకుండానే 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం సిక్సర్ల శర్మ ధాటికి పాక్ ఘోర పరాజయం పాలైంది. 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు సాధించి 7 వికెట్ల తేడాతో అప్రతిహత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
తోకముడిచిన పాక్ బ్యాటర్లు
కెప్టెన్ బాబర్ అజామ్(50; 58 బంతుల్లో, 7×4), మహ్మద్ రిజ్వాన్ (49; 69 బంతుల్లో, 7×4) మాత్రమే రాణించారు. ఈ ఇద్దరూ నిలబడటంతో పాక్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. ఓపెనర్లు అబ్దుల్ షఫీక్(20), ఇమాముల్ హక్(36) కాస్త పర్వాలేదనిపించారు. నిలకడగా ఆడుతున్న బాబర్ ను సిరాజ్ ఔట్ చేశాడు. అంతకుముందు షఫీక్ ను సైతం బుట్టలో వేసుకున్నాడు సిరాజ్. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. షకీల్(6), ఇఫ్తికార్(4), షాదాబ్(2) ఇలా కంటిన్యూగా అందరూ వెంటవెంటనే ఔటయ్యారు. 3 వికెట్లకు 155 రన్స్ తో పటిష్ఠంగా కనిపించిన పాక్.. మరో 36 పరుగులకే మిగతా 7 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో శార్దూల్ మినహా బుమ్రా, సిరాజ్, హార్దిక్, జడేజా, కుల్దీప్ అందరూ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.
భారత కెప్టెన్ దూకుడు
192 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ఇండియా దాయాది దేశాన్ని ఉతికి ఆరేసింది. డెంగీ నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన గిల్(’16’, 4×4)తోపాటు కోహ్లి(’16’, 3×4) కొద్దిసేపటికే అవుటయినా ఆ ప్రభావం జట్టుపై ఏ మాత్రం పడలేదు. ఇంకో ఎండ్ లో రోహిత్(86; 63 బంతుల్లో, 6×4, 6×6), సిక్సర్లు, ఫోర్లతో దడదడలాడించాడు. బంతి ఏ మాత్రం గతి తప్పినా బౌండరీ లైన్ తాకడమో లేదా అవతల పడటమో జరిగిపోయింది. కేవలం 36 బాల్స్ లోనే 3 ఫోర్లు, 4 సిక్స్ లతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడంతోపాటు 13.5 ఓవర్లలో భారత్ 100 పరుగులకు చేరుకుంది. చివర్లో రోహిత్ ఔటైనా శ్రేయస్ అయ్యర్ (53; 62 బంతుల్లో, 3×4, 2×6) కేఎల్ రాహుల్(19) జట్టును గెలుపుతీరాలకు చేర్చారు.