
వన్డే ప్రపంచకప్(World Cup) లో న్యూజిలాండ్ విజయయాత్ర(Successful Journey) కంటిన్యూ అవుతున్నది. ఇప్పటికే మూడింట్లో గెలిచిన ఆ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ తో చెన్నైలో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రతిభతో జయకేతనం ఎగురవేసింది. టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్.. న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించాడు. నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ 6 వికెట్లకు 288 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్ ఎలాంటి పోరాటం లేకుండానే 34.4 ఓవర్లలో 139 పరుగులకే చేతులెత్తేసి 149 రన్స్ తో కూడిన విజయాన్ని కివీస్ కు కట్టబెట్టింది. న్యూజిలాండ్ టీమ్ లో కెప్టెన్ సహా ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. గ్లెన్ ఫిలిప్స్(71), టామ్ లాథమ్(68), విల్ యంగ్(54) హాఫ్ సెంచరీలు చేయడంతో కివీస్ మెరుగైన స్కోరు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో నవీనుల్ హక్, అజ్మతుల్లా ఒమర్ జాయ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
కుప్పకూలిన అఫ్గాన్
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన అఫ్గాన్ టీమ్.. పెద్దగా ప్రతిఘటన లేకుండా కుప్పకూలింది. ఇంగ్లండ్ పై అసమాన పోరాట పటిమను ప్రదర్శించి సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. కివీస్ తో మ్యాచ్ లో బేజారయిపోయింది. బౌలింగ్ తో ప్రత్యర్థిని 300 లోపే కట్టడి చేసిన అఫ్గాన్.. టార్గెట్ రీచ్ కావడంలో ఫెయిల్ అయింది. 43 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. గుర్బాజ్(11), జర్దాన్(14), రహమత్ షా(36), షాహిది(8), ఒమర్ జాయ్(27), అలిఖిల్(19) ఇలా అందరూ తక్కువ వ్యక్తిగత స్కోరుకే అవుటవడటంతో ఆ జట్టు భారీ తేడాతో ఓడిపోయింది. శాంట్నర్, ఫెర్గూసన్ తలో మూడు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీసుకున్నారు. మ్యాచ్ లో హయ్యెస్ట్ రన్స్ చేసిన గ్లెన్ ఫిలిప్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ఈ విజయంతో కివీస్ జట్టు వరుసగా నాలుగో విజయంతో 8 పాయింట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచింది.