పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించి మంచి ఊపు మీదున్న భారత జట్టు(Team India) నేడు బంగ్లాదేశ్ తో తలపడబోతున్నది. పుణెలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో గెలిస్తే న్యూజిలాండ్ మాదిరిగానే భారత్ సైతం వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుంది. అన్నిరంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఆల్ రౌండ్ షో చూపిస్తున్న రోహిత్ సేనను ఎదుర్కోవాలంటే బంగ్లాదేశ్ పూర్తిస్థాయిలో రాణించాల్సి ఉంటుంది. భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియా, పాక్ వంటి పెద్ద జట్లను మట్టికరిపించి ఊపుమీదుంటే బంగ్లా మాత్రం ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. కెప్టెన్ షకీబుల్ హసన్ గాయంతో బాధపడుతుండటంతో ఈ మ్యాచ్ లో ఆడటం అనుమానమే. టీమ్ కు షకీబుల్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ అని ఆ జట్టు కోచ్ అంటున్నాడు.
బ్యాటింగ్, బౌలింగ్ లో అదరహో
ఇక భారత జట్టు గత కొంతకాలంగా ఎన్నడూ లేనంత పటిష్ఠంగా కనిపిస్తున్నది. కెప్టెన్ రోహిత్ శర్మ భీకర ఇన్నింగ్స్ ఆడుతూ మిడిలార్డర్ బ్యాటర్లు బ్యాటింగ్ కు రాకుండానే విజయాన్ని అందిస్తున్నాడు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ లపై రోహిత్ ఎలా ఆడాడో తెలిసిందే. కోహ్లిని మినహాయిస్తే రాహుల్, శ్రేయస్ సైతం మంచి ఫామ్ లోనే ఉన్నారు. గిల్, కోహ్లి సైతం బాగా ఆడితే భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయమని చెప్పాలి. అటు బౌలర్లు సైతం ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే వెనక్కు పంపుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో భారతే అన్ని జట్ల కన్నా హాట్ ఫేవరెట్ అని ఇప్పటికే క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేశారు.