‘గగన్ యాన్’ మిషన్ లో భాగంగా చేపడుతున్న టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 వాహక నౌకలో సాంకేతిక సమస్య(Technical Issue) తలెత్తింది. సాంకేతిక లోపంతో చివరి నిమిషంలో TV-D1 పరీక్షను నిలిపివేశారు. ఎక్కడ సమస్య వచ్చిందో గుర్తించే పనిలో ఉన్నామని ఇస్రో(Indian Space Research Organization) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఆ కొద్దిసేపటికే పరీక్ష నిర్వహించే సమయాన్ని వెంటనే ప్రకటించారు. ఉదయం 10 గంటలకు TV-D1 పరీక్షను నిర్వహిస్తామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ‘గగన్ యాన్’ టెస్ట్ వెహికిల్ డెమాన్ స్ట్రేషన్(Demonstration) లాంఛింగ్ సీక్వెన్స్ ప్రారంభించడానికి తొలుత ఈరోజు ఉదయం 8:45 గంటలకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ అయింది. శనివారం పొద్దున 8 గంటలకు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా వాతావరణం సరిగా లేకపోవడంతో దాన్ని 8:45 గంటలకు వాయిదా వేశారు. TV-D1 క్యారీయింగ్ క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ మొదలు కావడానికి 15 నిమిషాల ముందుగా సాంకేతిక సమస్యను గుర్తించారు.
2025లో చేపట్టనున్న ప్రధాన క్రూడ్ మిషన్ లో భాగంగా ఈరోజు తొలి పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని సమస్యను గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చంద్రయాన్-3 విజయంతో భారత కీర్తి పతాకను వినువీధిలో రెపరెపలాడించిన ఇస్రో.. ‘గగన్ యాన్’ ను సక్సెస్ చేయడం ద్వారా మన అంతరిక్ష మేధస్సును మరోసారి ప్రపంచానికి చాటబోతుంది.