గత ప్రపంచకప్ విన్నర్ అయిన ఇంగ్లండ్(England) ఈ వరల్డ్ కప్ లో ఎదురీదుతున్నది. శ్రీలంక(Sri Lanka)తో జరుగుతున్న మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కాస్తా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 123 పరుగులకే కీలక 7 వికెట్లు కోల్పోయింది. బెన్ స్టోక్స్ ఒక్కడే పోరాటం కొనసాగించాడు. ఓపెనర్లు బెయిర్ స్టో(30), డేవిడ్ మలన్(28) కాసేపు ఫర్వాలేదనిపించారు. 45 స్కోరు వద్ద ఫస్ట్ వికెట్ చేజార్చుకున్న ఆ టీమ్.. 85 రన్స్ కే 5 ప్రధాన వికెట్లను ప్రత్యర్థి చేతుల్లో పెట్టింది. జో రూట్(3), జోస్ బట్లర్(8), లివింగ్ స్టోన్(1), మొయిన్ అలీ(15) ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా ఒకరి వెంట ఒకరు క్యూ కట్టడంతో ఇంగ్లండ్ పరిస్థితి దారుణంగా తయారైంది. లంక ఫీల్డర్లు అద్భుత క్యాచ్ లు పట్టేయడంతో కీలక బ్యాటర్లంతా చేతులెత్తేయక తప్పలేదు.
గెలిస్తేనే ముందుకు
ఈ మ్యాచ్ లో శ్రీలంకపై గెలిస్తేనే ఇంగ్లండ్ ముందడుగు వేస్తుంది. లేదంటే ఈ వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇక ఇంటికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాలుగింటికి మూడు మ్యాచ్ ల్లో ఓడి కేవలం 2 పాయింట్లతో ఎనిమిదో ప్లేస్ లో ఉన్న ఇంగ్లిష్ జట్టు.. నెట్ రన్ రేట్ లోనూ బాగా వెనుకబడి ఉంది.