వరల్డ్ కప్ మొదలైన తర్వాత సాఫీగా సాగుతున్న మ్యాచ్ లతో సాదాసీదా(Normal)గా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఇన్నాళ్లకు అసలు సిసలు ఉత్కంఠ మ్యాచ్ నడిచింది. దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి వరకు విజయం ఇరుజట్లతో దోబూచులాడింది. తుదకు దక్షిణాఫ్రికానే విజయం వరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు అబ్దుల్ షఫీక్(9) ఇమాముల్ హక్(12), విఫలమైనా కెప్టెన్ బాబర్ అజామ్(50), సౌద్ షకీల్(52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. అయితే సౌతాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 రన్స్ చేసి ఒక వికెట్ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
అజామ్, సౌద్ హాఫ్ సెంచరీలు
పాక్ టీమ్ లో ఇద్దరు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. ఓపెనర్లు అబ్దుల్ షఫీక్(9) ఇమాముల్ హక్(12), విఫలమైనా కెప్టెన్ బాబర్ అజామ్(50), సౌద్ షకీల్(52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. రిజ్వాన్(31), ఇఫ్తికార్(21), షాదాబ్(43) ఫర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో షంషి 4, జాన్సన్ 3, కోయెట్జీ 2 వికెట్లు తీసుకున్నారు.
తడబడ్డ దక్షిణాఫ్రికా
ఇంకో 21 రన్స్ చేయాల్సిన దశలో మార్ క్రమ్ వెనుదిరగడంతో సౌతాఫ్రికా పరిస్థితి కష్టతరంగా మారింది. బవుమా(28), డికాక్(24), వాండెర్ డసెన్(21) తక్కువ స్కోరుకే అవుటైనా మార్ క్రమ్(91; 93 బంతుల్లో 7×4, 3×6) జట్టును ఒంటి చేత్తో నడిపించాడు. క్లాసెన్(12), మిల్లర్(29), జాన్సన్(20) ఏ ఒక్కరూ ఎక్కువ సేపు నిలబడలేదు. 250 స్కోరు వద్ద ఏడో వికెట్ గా మార్ క్రమ్ వెనుదిరగడంతో సౌతాఫ్రికా పరిస్థితి దయనీయంగా మారింది. ఆ తర్వాత ఎంగిడి(3) ఔటవడంతో మరింత ఉత్కంఠ ఏర్పడింది. షంషి(4 నాటౌట్) అండతో కేశవ్ మహరాజ్(7) జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంకేముంది పాకిస్థాన్ జట్టు బాధలో మునిగిపోగా, సౌతాఫ్రికా టీమ్ లో సంబరాలు మిన్నంటాయి.