న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ అసలు సిసలు పోరాటానికి వేదికగా నిలిచింది. శుక్రవారం సౌతాఫ్రికా-పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరగ్గా ఈరోజు కివీస్-ఆసీస్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. రచిన్ రవీంద్ర సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ట్రావిస్ హెడ్ ఫాస్ట్ సెంచరీతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అనంతరం 389 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన కివీస్.. చివరి వరకు పోరాటం కొనసాగించింది. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఆఖర్లో నీషమ్ ఔట్ కావడంతో కివీస్ కథ ముగిసింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 రన్స్ వద్దే ఆగిపోవడంతో 5 పరుగుల తేడాతో ఆసీస్ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది.
ట్రావిస్ హెడ్ ధనాధన్
న్యూజిలాండ్ టాస్ గెలిచి ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగిస్తే 49.2 ఓవర్లలో ఆ జట్టు 388 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్(109; 67 బంతుల్లో 10×4, 7×6) ఫాస్ట్ సెంచరీతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(83; 65 బంతుల్లో 5×4, 6×6) సైతం హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఇద్దరు ఓపెనర్లు ఫోర్లు, సిక్స్ లతో కివీస్ బౌలింగ్ ను ఆటాడుకున్నారు.
కివీస్ తుదకంటా పోరాటం
కివీస్ ను గెలిపించేందుకు రచిన్ రవీంద్ర(116; 89 బంతుల్లో 9×4, 5×6) సెంచరీతో మరోసారి ఒంటరి పోరాటం చేశాడు. 293 స్కోరు వద్ద ఆరో వికెట్ గా రచిన్ రవీంద్ర ఔటవడంతో టెన్షన్ మొదలైంది. రవీంద్ర ఔట్ తో కివీస్ పని అయిపోయిందని అనుకుంటున్న టైమ్ లో జిమ్మీ నీషమ్(58; 39 బంతుల్లో 3×4, 3×6) వేగవంతమైన హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియా ఆటగాళ్లను కంగారెత్తించాడు. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన తరుణంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఫస్ట్ బాల్ కు సింగిల్ ఇచ్చిన స్టార్క్ రెండో బాల్ ను వైడ్ వేశాడు. కానీ ఆ బాల్ కీపర్ కు అందకపోవడంతో ఫోర్, సింగిల్ తోపాటు మొత్తం 6 పరుగులు వచ్చాయి. దీంతో రెండు బాల్స్ కు 7 రన్స్ రాగా.. తర్వాతి మూడు బంతులకు వరుసగా రెండేసి చొప్పున ఆరు పరుగులు వచ్చాయి. అలా నాలుగు బంతుల్లో 13 రన్స్ రావడంతో న్యూజిలాండ్ కు గెలుపుపై ఆశలు కనిపించాడు. కానీ ఐదో బంతికి నీషమ్ రనౌట్ కావడంతో ఆస్ట్రేలియా విజయం ఖాయమైపోయింది.