రాష్ట్రంలో నామినేషన్లకు సమయం దగ్గర పడుతున్న వేళ కేంద్రం ఎన్నికల సంఘం(Centra Election Commission) అధికారులు రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. తెలంగాణలో పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు గాను సీనియర్ డిప్యూటీ కమిషనర్లతో కూడిన టీమ్ ఇక్కడకు వస్తున్నది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తో భేటీ అయిన అనంతరం వివిధ విభాగాలతో సమావేశాలు(Meetings) నిర్వహించనుంది. ఎన్నికల ఏర్పాట్లు, మరింత గట్టిగా చేపట్టాల్సిన భద్రత తీరుపై సమావేశంలో చర్చిస్తారు.
నవంబరు 3 నుంచి రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇందుకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఆ దిశగా కసరత్తు చేపట్టనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులు, ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ కాగా.. తాజాగా ఈ ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్లు మీటింగ్ నిర్వహించే అవకాశముంది.