ఒకటి నుంచి ఎనిమిదో నంబరు దాకా బెస్ట్ బ్యాటర్లు… అందులో ఏ ఇద్దరు ఫామ్ లో ఉన్నా ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. ముందు బ్యాటింగ్ అయితే వీర బాదుడు.. టార్గెట్ రీచ్(Target Reach) చేయాల్సి వస్తే భారీ స్కోర్లను లెక్కచేయకపోవడం. ఇదీ గత కొద్దిరోజులుగా కనపడుతున్న దక్షిణాఫ్రికా ఆట తీరు. ఈ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది కానీ.. మిగతా మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా తీరు మామూలుగా లేదు మరి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దక్కిందా.. ఇక అంతే సంగతులు. ఆడిన ఏడింట్లో ఐదు సార్లు 300 పైగా స్కోర్లు సాధిస్తే అందులో ఒకసారి 400కు పైగా, మరో మూడు సార్లు 350కి పైగా ఉన్నాయంటేనే ఆ టీమ్ బ్యాటర్ల విధ్వంసం ఎలా సాగుతుందో అర్థమవుతున్నది. అందుకే పాయింట్లలో వెనుకబడ్డా నెట్ రన్ రేట్ లో మాత్రం బవుమా సేనను మించిన టీమ్ లేదు. ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఐదింట్లో ముందు బ్యాటింగ్ చేయాల్సి వస్తే మరో రెండింట్లో టార్గెట్ ఛేదించింది సౌతాఫ్రికా.
డికాక్ సెంచరీ చేసినప్పుడల్లా
ఆడితే బాగా ఆడుతుంది.. లేదంటే ఆ రోజు అత్యంత దారుణంగా ఓటమి పాలవుతుంది. అలాంటి అయోమయ సౌతాఫ్రికాకు అండగా నిలుస్తున్నాడు క్వింటన్ డికాక్. సూపర్ ఫామ్ లో ఉన్న డికాక్ కంటిన్యూగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసిన రికార్డును సొంతం చేసుకున్న డికాక్.. సెంచరీల్లోనూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అక్టోబరు 7న శ్రీలంకతో వరల్డ్ కప్ ప్రస్థానం మొదలుపెట్టిన ఆ టీమ్ 428/5 స్కోరు చేసి 102 రన్స్ తో విజయం సాధించింది. 12న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 311/7 చేసి కంగారూలను 177కే ఆలౌట్ చేసింది. 21నాడు వాంఖడేలో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 399/7 స్కోరు చేసి ప్రత్యర్థి 170కే చాప చుట్టేలా చేశారు బౌలర్లు. అక్టోబరు 24న బంగ్లాదేశ్ తోనూ 382/5 స్కోరు చేయగా.. ఈ రోజు న్యూజిలాండ్ తో 357/4తో ముగించింది. ప్రస్తుత వరల్డ్ కప్ లో ఈ స్థాయిలో స్కోర్లు చేసిన జట్లు కనుచూపు మేరలో లేవు. భారత పిచ్ లపై బ్యాటింగ్ కు ఇబ్బందులు పడుతున్న టీమ్ లకు భిన్నంగా దక్షిణాఫ్రికా మాత్రం దంచికొడుతున్నది. ప్రతి వరల్డ్ కప్ లోనూ లీగ్ దశలో గర్జించే సౌతాఫ్రికా.. సెమీస్ కు వచ్చేసరికి చతికిల పడటం అలవాటు చేసుకుంది. మరి ఈసారి ఆ జట్టు అదృష్టం ఎలా ఉందో చూడాలి మరి.