BRS, కాంగ్రెస్ పొత్తుల కోసం వేచి చూసి అవి నెరవేరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించిన CPM.. తమ క్యాండిడేట్స్ పోటీ చేసే స్థానాల్ని ప్రకటించింది. 17 నియోజకవర్గాల(Constituencies)తో కూడిన జాబితా(List)ను వెల్లడించగా.. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తున్నది. ఎవరితో పొత్తు లేకుండా విడిగా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు చోట్ల, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు సెగ్మెంట్లలో పోటీకి దిగబోతున్నది. మిగతా నాలుగు వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. మరో ఏడు స్థానాల గురించి తర్వాత తెలియజేస్తామని తమ్మినేని అన్నారు. పొత్తుల కోసం ఎన్నో మెట్లు దిగివచ్చినా ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
పోటీకి దిగే స్థానాలివే
ఖమ్మం జిల్లాలో భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర, ఖమ్మం, వైరా, సత్తుపల్లి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, నకిరేకల్, భువనగిరి హుజూర్ నగర్, కోదాడతోపాటు జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో CPM పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకటించారు. అయితే అభ్యర్థుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.