అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కమలం పార్టీ ఇక ప్రచారంలో జోరు పెంచేందుకు బహిరంగసభలు ఏర్పాటు చేస్తున్నది. అగ్రనేతల్ని రప్పించి ప్రజలకు చేరువ కావాలన్న ఆలోచనతో ఏకంగా ప్రధాని కార్యక్రమాన్నే అమలులోకి తేబోతున్నది. ఈ నెల 7, 11 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే సభలకు ప్రధాని(Prime Minister) నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అగ్రనేతల టూర్ ప్లాన్ లో భాగంగా ఏకంగా మోదీతోనే సభలకు శ్రీకారం చుడుతున్నది. 7న హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో BC గర్జన సభ, 11న పరేడ్ గ్రౌండ్ లో మరో సభ ఉండనుంది. పార్టీ అధికారంలోకి వస్తే BCని ముఖ్యమంత్రి చేయడం, రాష్ట్రంలోని 26 వెనుకబడ్డ వర్గాలను OBC జాబితాలో చేర్చే అంశంపై సభ జరగనుంది. ఇక 11 నాడు నిర్వహించే పరేడ్ గ్రౌండ్ సభలో SCల వర్గీకరణ, వారి సమస్యలపై ప్రస్తావన ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరింతమంది పార్టీ కీలక నేతలు
ప్రధాని మోదీ సభలు త్వరలోనే ప్రారంభం కానుండగా ఇక ముఖ్య నేతల్ని కూడా ప్రచారానికి రప్పించాలని రాష్ట్ర కమలం పార్టీ చూస్తోంది. జేపీ నడ్డా, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీలోని కీలక పదవుల్లో ఉన్నవారితోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా రప్పించే యోచనలో ఉన్నారు.