భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్(India Premier League)కు ఉన్న క్రేజే వేరు. కోట్లాది హృదయాల్ని గెలుచుకుంటూ ఏటా వేలాది కోట్లు తెస్తూ భారత క్రికెట్ ను ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కి కాసుల పంట పండిస్తున్న అలాంటి IPLపై.. సౌదీ అరేబియా కన్ను పడింది. అమ్మితే కొనడానికి సిద్ధపడ్డ సౌదీ యువరాజు.. ఎంతకైనా వెచ్చించేందుకు సై అంటున్నారట. IPLను తమకు కట్టబెడితే 30 బిలియన్ డాలర్లు(రూ.2.5 లక్షల కోట్లు) వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ రాజైన మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు అంటున్నారట. హోల్డింగ్ కంపెనీగా IPLను ప్రభుత్వం ప్రకటిస్తే రూ.2.5 లక్షల కోట్లయినా పెట్టేందుకు రెడీగా ఉన్నారట. మొన్నటి సెప్టెంబరులో సౌదీ రాజు భారత్ టూర్ కు వచ్చినపుడు తమ అంతరంగాన్ని బయటపెట్టారన్నది టాక్.
విస్తరణ కోసం రూ.41,500 కోట్లు
ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్, యురోపియన్ ఛాంపియన్ లీగ్ తరహాలో IPLను మరిన్ని దేశాలకు విస్తరించే(Expansion) ఛాన్స్ ఇచ్చినా సరే 5 బిలియన్ డాలర్లు(రూ.41,500 కోట్లు) పెట్టేందుకు సౌదీ ఇంట్రస్ట్ చూపుతుందన్నది సారాంశం. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోపు BCCI నుంచి కాల్ వస్తుందన్న ఆశతో ఆ దేశం ఎదురుచూస్తున్నది. కానీ దీనిపై ఇటు BCCI గానీ, అటు సౌదీ నుంచి ఎలాంటి స్పందనా లేదట. 2027 వరకు ఐపీఎల్ బ్రాడ్ కాస్ట్ హక్కుల కోసం గతేడాది 6.2 బిలియన్ డాలర్లు(రూ.50,000) కోట్లు వెచ్చించారు. 8 వారాల పాటు సాగే టోర్నీలో ఒక్కో మ్యాచ్ కు 15.1 మిలియన్ డాలర్లు అంటే ఈ లెక్కన రూ.124 కోట్లు ప్రసార హక్కుల రూపంలో వచ్చాయి. ఇది ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ EPL కన్నా ఎక్కువ కాగా.. USలో నిర్వహించే నేషనల్ ఫుట్ బాల్ లీగ్ కు దగ్గరగా ఉంది. NFLలో ఒక్కో మ్యాచ్ కు 17 మిలియన్ డాలర్లు(రూ.139 కోట్లు) పలుకుతున్నది.
IPL ఫార్ములాతో అమెరికా లీగ్ లు
IPL ఫార్ములాతో అమెరికాలో క్రికెట్ లీగ్ ల కోసం కార్పొరేట్ కంపెనీల పెద్దలు సై అంటున్నారు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, అడోబ్ CEO శంతను నారాయణ్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. ఈ అమెరికా లీగ్ లతోపాటు సౌతాఫ్రికా, UAE లీగ్ లపై కన్నేసినా అవి IPL స్థాయిలో లేకపోవడంతో సౌదీ ఇంట్రస్ట్ చూపడం లేదు. ఇప్పటివరకు గోల్ఫ్, ఫుట్ బాల్ పై దృష్టిపెట్టిన సౌదీ.. కొంటే IPLనే కొనాలన్న పట్టుదలతో ఉంది. EPL ఓనర్లలో ఒకరిగా ఉన్న సౌదీ.. 2034 ఫిఫా వరల్డ్ కప్ కు తమ దేశంలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నది. బ్రెజిల్, పోర్చుగీస్ సూపర్ స్టార్లు నెయ్ మార్, క్రిస్టియానో రొనాల్డోతోపాటు ఫ్రాన్స్ స్టార్ కరీం బెంజిమా కోసం మిలియన్ డాలర్లను ధారపోసిన మహ్మద్ బిన్ సల్మాన్.. క్రికెట్ లీగ్ కొంటే మాత్రం అది ఐపీఎలే అవ్వాలని పట్టుబడుతున్నారట.