ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మహిళల హక్కుల(Women Rights) కోసం అలుపెరుగని కృషి చేస్తున్న కె.జ్యోతి.. ఎన్నికల బరిలో దిగారు. డబ్బులిచ్చి ఓట్లు కొనడం కాదు.. ప్రజలు ఇచ్చే విరాళాలు, చందాలతోనే ఎన్నికల్లో నిలబడాలన్న ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్టు) SUCI(C) అభ్యర్థిగా ఆమె శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె.. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజా సమస్యలే పరమావధిగా పనిచేస్తున్నారు.
మద్దతుదారులు, పార్టీ లీడర్లతో ర్యాలీగా
ఖైరతాబాద్ లైబ్రరీ నుంచి మార్కెట్ వీధుల మీదుగా మద్దతుదారుల(Supporters)తో కలిసి ప్రదర్శనగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న జ్యోతి.. ROకు నామినేషన్ అందజేశారు. SUCI(C) పార్టీ రాష్ట్ర నాయకులు సీహెచ్ మురహరి, ప్రమీల, పి.తేజ, గంగాధర్ సహా పలువురు జ్యోతి వెంట ఉన్నారు. ఓటుకు నోటు రాజకీయాలకు స్వస్తి పలికేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ ప్రధాన ధ్యేయమని అభ్యర్థి జ్యోతి అన్నారు.