తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ అసలు ఆటను ప్రదర్శించింది. ఈ వరల్డ్ కప్(World Cup)లో పేలవ ఆటతీరుతో స్వదేశం నుంచి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న ఆ జట్టు ఎట్టకేలకు పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుని సెమీస్ రేసులో నిలిచింది. పలుసార్లు వర్షం అంతరాయం కలిగించిన బెంగళూరు మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం పాక్ విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 401 పరుగుల భారీ స్కోరు సాధించింది. రచిన్ రవీంద్ర(108; 94 బంతుల్లో 15×4, 1×6) మరోసారి సెంచరీ సాధించడంతోపాటు కెప్టెన్ విలియమ్సన్(95; 79 బంతుల్లో 10×4, 2×6) దుమ్ముదులపడంతో కివీస్ భారీ స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాక్ 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 201 రన్స్ చేసింది. ఆట మొదలయ్యే అవకాశం లేకపోవడంతో పాక్ ను విజేతగా ప్రకటించారు.
ఫకర్ జమాన్ ఫాస్టెస్ట్ సెంచరీ
కివీస్ జట్టులో రచిన్ రవీంద్ర సెంచరీ సాధిస్తే అందుకు ప్రతిగా ఫకర్ జమాన్(126; 81 బంతుల్లో 8×4, 11×6) వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాక్ ఇక వెనుదిరిగి చూడలేదు. ముఖ్యంగా జమాన్ ఆకాశమే హద్దుగా సిక్సర్లతో విరుచుకుపడగా, అటు కెప్టెన్ బాబర్ సైతం 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 66 రన్స్ చేశాడు. జమాన్ 39 బాల్స్ లో హాఫ్ సెంచరీ, 63 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. వరల్డ్ కప్ చరిత్రలో పాక్ తరఫున అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు నెలకొల్పాడు. 21.3 ఓవర్లలో 160/1 వద్ద వర్షం అడ్డు పడితే.. మళ్లీ 200 స్కోరు వద్ద అంతరాయం కలిగింది. ఫకర్ జమాన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. 8 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, మరో నాలుగు ఓటములు కలిపి చెరో 8 పాయింట్లతో పాక్, కివీస్ సమంగా నిలిచాయి.