327 పరుగుల టార్గెట్.. ఏడుగురు సంచలన బ్యాటర్లు.. ఈ వరల్డ్ కప్ లో ఆడిన 7 మ్యాచ్ ల్లో 4 సెంచరీలు చేసిన హీరో.. అఫ్గానిస్థాన్ మినహా అన్ని జట్లపైనా గెలుపొందిన రికార్డు.. ఇదీ భారత్ తో మ్యాచ్ కన్నా ముందు సౌతాఫ్రికా రికార్డు. వీటన్నింటినీ చూస్తే టీమిండియా విసిరిన లక్ష్యం ఛేదించడంలో హోరాహోరీ పోరు తప్పదని, ఫస్ట్ బాల్ నుంచే దంచుడు ఉంటుందని అంతా భావించారు. కానీ అద్భుత ఫామ్ లో ఉన్న భారత బౌలర్ల ముందు సౌతాఫ్రికా పప్పులు ఉడకడం లేదు. ప్రతి ఓవర్ కు 6.26 రన్ రేట్ తో సాగాల్సిన బ్యాటింగ్ కు పూర్తి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. బుమ్రా, సిరాజ్, జడేజా, షమి బంతుల్ని ఎదుర్కోవడానికి బవుమా సేన అపోసాపాలు పడుతున్నది. తొలి 10 ఓవర్లలో ఆ టీమ్ 3 వికెట్లకు 35 రన్స్ మాత్రమే చేసింది.
మరోసారి బౌలర్ల హవా
వరల్డ్ కప్ షో ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న భారత బౌలింగ్ దళం.. దక్షిణాఫ్రికాను ఆత్మరక్షణ(Seft Defense) లో పడేసింది. తొలి 15 ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీసి తానేంటో మరోసారి చాటిచెప్పింది. డికాక్(5), బవుమా(11), మార్ క్రమ్(9), క్లాసెన్(1) ఇలా హేమాహేమీ బ్యాటర్లంతా పెవిలియన్ బాట పట్టారు. 6 వద్ద ఫస్ట్ వికెట్, 22 వద్ద రెండో వికెట్, 35 వద్ద 3, 40 స్కోరు వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది ప్రత్యర్థి జట్టు. షమి, జడేజా చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకుంటే సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు.