సొంతగడ్డపై టీమిండియా అదరగొడుతున్నది. జట్టు ఏదైనా, బ్యాటింగ్ ముందా తర్వాతనా.. ఎలాగైనా సరే దుమ్మురేపుతోంది. 7 అప్రతిహత విజయాల(Continue Wins)తో సాగుతున్న రోహిత్ సేన.. పాయింట్స్ టేబుల్ లో తన వెనుకే వస్తున్న దక్షిణాఫ్రికాకు దారుణ ఓటమిని రుచిచూపింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేస్తే.. సౌతాఫ్రికా ఏ మాత్రం పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. 27.1 ఓవర్లలో 83 పరుగులకు ఆలౌటై 243 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. సూపర్ బౌలింగ్ తో జడేజా.. ఆ టీమ్ టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించాడు.
బర్త్ డే స్పెషల్ విరాట్
కోహ్లి(101 నాటౌట్; 121 బంతుల్లో 10×4) సెంచరీతో భారత్ భారీ స్కోరు చేసింది. అటు శ్రేయస్(77; 87 బంతుల్లో 7×4, 2×6) సైతం హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్ స్టార్టింగ్ నుంచే పరుగుల వరద పారించగా ఓపెనర్ల ధాటికి టీమిండియా 4.3 ఓవర్లలోనే 50 స్కోరుకు చేరుకుంది. రోహిత్(40; 24 బంతుల్లో 6×4, 2×6) మంచి ఫామ్ లో ఉన్న దశలో ఔట్ కాగా.. కొద్దిసేపటికే గిల్(23; 24 బంతుల్లో 4×4, 1×6) వెనుదిరిగాడు. మహరాజ్ వేసిన సూపర్ డెలివరీకి ఆశ్చర్యకర రీతిలో గిల్ అవుట్ అయ్యాడు. శ్రేయస్ తో కలిసి విరాట్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. కోహ్లి 119 మ్యాచ్ ల్లో 6,000 పరుగులు పూర్తి చేసుకోగా 49వ సెంచరీతో సచిన్ చెంతన నిలిచాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (29; 15 బంతుల్లో 3×4, 1×6) ధాటిగా ఆడాడు. మార్కో జాన్సన్ 9 ఓవర్లలో 9.33 ఎకానమీతో 84 రన్స్ ఇచ్చాడంటే అతణ్ని ఏ విధంగా ఉతికి ఆరేశారో అర్థమవుతుంది.
జడేజా మ్యాజిక్.. చేతులెత్తేసిన సౌతాఫ్రికా
భారత్ ఉంచిన భారీ టార్గెట్ రీచ్ కావడంలో సౌతాఫ్రికా ఏ దశలోనూ ప్రయత్నించినట్లు కనపడలేదు. బౌలర్లు వికెట్ల కోసం పోటీ పడటంతో హిట్టర్లుగా పేరున్న బ్యాటర్లు ఒక్కరొక్కరుగా పెవిలియన్ కు చేరుకున్నారు. బ్యాటింగ్ లో కోహ్లి సత్తా చూపిస్తే బౌలింగ్ లో జడేజా 5 వికెట్లతో సత్తా చాటాడు. డికాక్(5), బవుమా(11), మార్ క్రమ్(9), క్లాసెన్(1), డసెన్(13), మిల్లర్(11), జాన్సన్(14) ఇలా హేమాహేమీ బ్యాటర్లంతా పెవిలియన్ బాట పట్టారు. 67కే 7 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన బవుమా సేన మొదట్నుంచీ ఆత్మరక్షణ ధోరణిలో ఆడి వికెట్లు చేజార్చుకుంది. ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ గెలుపొంది 16 పాయింట్లతో ఎవరికీ అందని రీతిలో నెట్ రన్ రేట్ ను సైతం టీమిండియా సొంతం చేసుకుంది. సెంచరీ హీరో విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.