క్రీడా ప్రపంచంలో భారత కీర్తి రెపరెపలాడుతున్నది. ఇప్పటికే వరల్డ్ కప్ క్రికెట్ టీమిండియా దూసుకుపోతుంటే తాజాగా మన మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్ గా అవతరించింది. ఝార్ఖండ్ లో జరిగిన మహిళల ఆసియా హాకీ(Women Asia Hockey) టోర్నమెంట్ లో భారత జట్టు జయకేతనం ఎగురవేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ పై ఫైనల్ లో గెలిచి ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడమే కాకుండా జపాన్ కు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. 4-0 గోల్స్ తేడాతో ఓడించి మన మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ప్రస్తుత వరల్డ్ కప్ లో భారత క్రికెట్ జట్టు ఆటతీరు మాదిరిగానే మహిళల హాకీ టీమ్ సైతం కంటిన్యూ విజయాలతో దూసుకుపోయింది. ఆసియా టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్ ల్లోనూ విజయాల్ని నమోదు చేసుకుని ఔరా అనిపించింది.
హాకీ ఇండియా నజరానా
ఫ్లడ్ లైట్ల సమస్యతో మ్యాచ్ 50 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. సంగీత కుమారి(17వ నిమిషం), నేహ(46వ నిమిషం), లారెమ్ సియామి(57వ నిమిషం), వందన కటారియా(60వ నిమిషం)లో గోల్స్ సాధించారు. మహిళా ప్లేయర్లు చూపిన ప్రతిభపై హాకీ ఇండియా ప్రశంసలు కురిపించింది. విజేతగా నిలిచిన టీమ్ లోని ప్రతి ఒక్కరికీ రూ.3,00,000 నజరానా ప్రకటించింది. అసిస్టెంట్ టీమ్ లోని ప్రతి ఒక్కరికీ రూ.1,05,000ల బహుమతి ఇస్తున్నట్లు తెలిపింది.