అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఇక నామినేషన్లకు వేగం పెరగనుంది. ఈనెల 3 ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియకు స్వల్ప స్థాయిలో దరఖాస్తులు(Applications) రాగా ఇవాళ్టి నుంచి ఇక జోరందుకోనున్నాయి. PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ రోజు కొడంగల్ లో నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి ఈ నెల 3న ఒక నామినేషన్ సెట్ దాఖలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఈ నెల 10న కామారెడ్డిలోనూ నామినేషన్ వేయబోతున్నారు. ముఖ్యమంత్రి KCRపై పోటీ చేయనున్నట్లు ప్రకటించిన రేవంత్.. అనుకున్నట్లుగానే కామారెడ్డిలో ఆయనపై రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కొడంగల్ లో ఒక సెట్ ను ఆయన సోదరుడు వేయగా, మరో సెట్ ను ఇవాళ రేవంత్ రెడ్డి వేస్తారు.
బండి భారీ స్థాయిలో
అటు కరీంనగర్ MP బండి సంజయ్ సైతం కరీంనగర్ లో నామినేషన్ వేస్తున్నారు. మోటార్ సైకిల్ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయాలని సంజయ్ నిర్ణయించారు. NTR చౌరస్తా నుంచి గీతాభవన్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగనుండగా, పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ప్రకాశ్ జవదేకర్, రాజాసింగ్ సహా పలువురు నేతలు బండి సంజయ్ కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.