మూడున్నర దశాబ్దాల తర్వాత దిగ్గజ నటుడు, స్టార్ దర్శకుడి కాంబినేషన్ లో మరో మూవీకి అడుగులు పడ్డాయి. సూపర్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతున్నది. ఇందుకు సంబంధించిన టైటిల్ ఈ రోజు సాయంత్రం ప్రకటించబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరోసారి తెరకెక్కబోతున్న KH234 గురించి ఇప్పటివరకు అటు కమల్ గానీ ఇటు మణిరత్నం కానీ పెదవి విప్పలేదు. తాజా సినిమాకు AR రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కమల్ ఇటీవల జియో మామి ముంబయి ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా 2023కు గాను మణిరత్నానికి ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డును అందజేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నాయగణ్’ సినిమా 36 ఏళ్ల క్రితం తమిళ చిత్ర సీమను ఊపేసింది. ఇతర భాషల్లోనూ తెరకెక్కి సంచలనం సృష్టించింది. మణి-రహమాన్ ఆధ్వర్యంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు పార్ట్ లు ఎంతటి సక్సెస్ అయ్యాయో తెలిసిందే. హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తోపాటు మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ లో ఈ సినిమా రానుంది.
స్క్రిప్ట్ ఉంటేనే వెళ్తానన్న మణిరత్నం
కమల్, రజనీకాంత్ వద్దకు వెళ్లాలంటే తగిన స్క్రిప్ట్ ఉండాలన్నది తన ఉద్దేశమని మణిరత్నం అన్నారు. ‘రోజా స్క్రిప్టును రజనీ దగ్గరకు వెళ్లి చేయమని అడగలేను.. ఇలాంటి స్టోరీలు ఆయనకు పనిచేయవు.. స్టార్ హీరో ఫాలోయింగ్ ను తీర్చిదిద్దాల్సిన పనిలేదు.. వారి గురించి ముందుగా తెలుసుకోవాలంతే.. నిజానికి నేను ఇప్పటికీ మిస్టర్ బచ్చన్ వద్దకు వెళ్లలేకపోయాను.. ఎందుకంటే ఆయనకు తగ్గ స్క్రిప్టు నా దగ్గర లేదు’ అని మణిరత్నం అన్నారు.