ఆకస్మిక కుంగుబాటుకు గురైన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలోనే లోపాలు(Defects In Construction) ఉన్నాయని తెలంగాణ జన సమితి(TJS) అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. పరిస్థితులు, వాతావరణానికి తగ్గట్లు ప్రాజెక్టును డిజైన్ చేయకపోవడం వల్లే ఈ ఉపద్రవం తలెత్తిందని విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్టును ఆగమేఘాల మీద పూర్తి చేయాలని చూశారని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోని కారణంగానే నాణ్యత లోపించిందన్నారు.
దీనికితోడు డిజైన్లు మార్చి మరీ అంచనాల(Estimations)కు మించి ఖర్చు చేశారని, ఈ విషయాన్ని తన నివేదికలోనూ ‘కాగ్’ కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఈ పరిణామంతో రూ.50,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైందని, ఇది రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.