
అంతర్జాతీయ క్రికెట్(International Cricket) చరిత్రలో తొలి ‘టైమ్డ్ ఔట్’ నమోదైంది. వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. 25వ ఓవర్లో నాలుగో వికెట్ గా లంక బ్యాటర్ సదీర సమరవిక్రమ ఔట్ అయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్ తన హెల్మెట్ సమస్యతో ఇబ్బందులు పడ్డాడు. హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోవడంతో దాన్ని సరిచేసేందుకు బ్యాటింగ్ స్టార్ట్ చేయలేకపోయాడు. ICC నిబంధనల ప్రకారం ఔటైన బ్యాటర్ స్థానంలో మరొకరు రెండు నిమిషాల్లో ఆట ప్రారంభించాలి. కానీ మాథ్యూస్ హెల్మెట్ సరిచేసుకునే సరికే 2 నిమిషాలు పూర్తయిపోయింది. దీంతో బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ ‘టైమ్డ్ ఔట్’కు అప్పీల్ చేయగా అంప్లైర్లు ఔట్ ఇచ్చారు.

బతిమిలాడినా ఫలితం శూన్యం
జరిగిన ఘటనపై అంపైర్లతో మాథ్యూస్ మాట్లాడాడు. షకిబుల్ ఒప్పుకోవడమొక్కటే దీనికి పరిష్కారమని అంపైర్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో షకిబుల్ దగ్గరకు వెళ్లి మరీ తనకు ఎదురైన సిట్యుయేషన్ ను మాథ్యూస్ వివరించాడు. కానీ బ్యాటర్ మాటలకు బంగ్లా కెప్టెన్ ఏ మాత్రం రెస్పాండ్ కాలేదు. దీంతో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’గా వెనుదిరగాల్సి వచ్చింది. గ్రౌండ్ ను వీడుతూ ఏంజెలో తీవ్ర అసంతృప్తికి లోనవుతూనే బౌండరీ లైన్ దాటాక హెల్మెట్ ను విసిరికొట్టాడు. ఐదో వికెట్ గా అతడు పెవిలియన్ కు చేరుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్ లో తొలి ‘టైమ్డ్ ఔట్’ రికార్డయింది. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆట ఆడటమే కాదు.. రూల్స్ పాటించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.