టికెట్ల ప్రకటించే సమయంలో ఆందోళనలనకు నిలయంగా మారే గాంధీభవన్.. ఈసారి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ ప్రకటించిన మూడో లిస్టు(Third List)పై అసంతృప్త నేతలు ఆందోళన బాట పట్టారు. గాంధీభవన్ ఎదుట బైఠాయించి లీడర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు కార్యకర్తలు ఫెన్సింగ్ ను విరగ్గొట్టడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీనియర్లకు టికెట్ దక్కకపోవడం, ఇప్పటికే ప్రకటించినవారి పేర్లను సైతం తాజా లిస్టులో మార్చడంతో వివిధ నియోజకవర్గాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో మాజీ మంత్రి, ST సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర సీనియర్ లీడర్లు ఉన్నారు.
సెగ్మెంట్ల వారీగా చూస్తే
వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ లీడర్ చిన్నారెడ్డి పేరు ఇప్పటికే ప్రకటించినా మూడో లిస్టులో ఆయన్ను తొలగించి తూడి మేఘారెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో చిన్నారెడ్డితోపాటు ఆయన అనుచరులు పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. వారందరినీ సముదాయిస్తూనే ఈ మాజీమంత్రి… పార్టీ తనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పటాన్ చెరుకు సంబంధించి కాటం శ్రీనివాస్ గౌడ్ ఆశలు పెట్టుకోగా.. నీలం మధుకు ప్రకటించారు. దీంతో శ్రీనివాస్ అనుచరులు ఆందోళన చేస్తున్నారు. అటు ST సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన బెల్లయ్యనాయక్ సైతం నిరసనకు దిగారు. తనకు టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ గాంధీభవన్ వద్ద మౌనదీక్ష చేస్తున్నారు. మహబూబాబాద్, డోర్నకల్ లో ఏదో ఒక సీటు ఇవ్వాలని కోరినా నేతలు పట్టించుకోవట్లేదని అంటున్నారు.