వరల్డ్ కప్ సెమీస్ లో ఇప్పటికే మూడు జట్లు బెర్తులు దక్కించుకోగా.. ఫోర్త్ ప్లేస్ కోసం మూడు టీమ్ లు పోటీ పడుతున్నాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు పోటీలో ఉండగా.. సెమీస్ లో భారత్-పాక్ తలపడే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కంటిన్యూ విజయాలతో ఫస్ట్ ప్లేస్ తో భారత్(16 పాయింట్లు), 2, 3, స్థానాలతో దక్షిణాఫ్రికా(12), ఆస్ట్రేలియా(12) ఇప్పటికే సెమీస్ చేరాయి. మొత్తం టోర్నీలోని అన్ని జట్లు ఇంకో మ్యాచ్ ఆడనుండగా.. కివీస్, పాక్, అఫ్గాన్ మ్యాచ్ లే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మూడు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. నెట్ రన్ రేట్ పరంగా కివీస్(+0.398), పాక్(+0.036), అఫ్గాన్(-0.338)తో నిలిచాయి. చివరి మ్యాచ్ లో ఈ ముగ్గురు గెలిచినా, ఓడినా రన్ రేట్ కీలకమవుతుంది.
ఎవరి లెక్క ఎలా…
(1-4), (2-3) స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. గురువారం జరిగే మ్యాచ్ లో శ్రీలంకను న్యూజిలాండ్ ఓడిస్తే ఇక లెక్కలతో పని లేకుండా కివీస్ సెమీస్ చేరి భారత్ ప్రత్యర్థి అవుతుంది. శుక్రవారం జరిగే మ్యాచ్ లో సౌతాఫ్రికాతో అఫ్గాన్ భారీ ఆధిక్యంతో గెలిచినా.. కివీస్ విజయంతో అది ఎందుకూ పనికిరాదు. ఇక పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ ను శనివారం ఇంగ్లండ్ తో ఆడుతుంది. ఇందులో భారీ రన్ రేట్ తో పాక్ నెగ్గితేనే అవకాశాలుంటాయి. అక్కడ కివీస్, ఇక్కడ పాక్ గెలిస్తే గనుక మళ్లీ రన్ రేట్ దే ముఖ్య పాత్ర. అందుకే కివీస్ ఓడితేనే పాక్, అఫ్గాన్ కు సెమీస్ అవకాశాలుంటాయి.
ఇలా జరిగితేనే
లంకతో న్యూజిలాండ్ ఓడి, దక్షిణాఫ్రికాపై అఫ్గాన్ గెలిస్తే, ఇంగ్లండ్ పై పాక్ తప్పక విజయం సాధించాలి. అప్పుడు పాక్, అఫ్గాన్ చెరో 10 పాయింట్లతో ఉంటాయి. మంచి రన్ రేట్ కలిగిన పాక్ డైరెక్ట్ గా సెమీస్ చేరుతుంది. న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ వర్షం బారిన పడితే చెరో పాయింట్ దక్కనుండగా, అప్పుడు కివీస్ 9 పాయింట్లతో ఉంటుంది. ఇంగ్లండ్ పై పాక్ గెలిస్తే 10 పాయింట్లతో సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ మ్యాచ్ పక్కనపెడితే అసలు పోటీ కివీస్-పాక్ మధ్యనే ఉండనుంది. ఇంగ్లండ్ పై గెలిచినా పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే మాత్రం న్యూజిలాండ్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది.