గెలిస్తే నేరుగా సెమీస్ కు… ఓడితే మాత్రం ఇక ఛాన్స్ లేనట్లే. ఇదీ న్యూజిలాండ్ పరిస్థితి. నేడు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో తప్పక భారీ విజయాన్ని సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగళూరులో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. వర్షం అడ్డుపడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతున్నది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. దీంతో శనివారం జరిగే పాకిస్థాన్-ఇంగ్లండ్ మ్యాచ్ పైనే కివీస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మూడు జట్లు(న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్) సెమీస్ రేసులో ఉన్నాయి. 8 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, మరో నాలుగు ఓటములతో 8 పాయింట్లతో ఉండగా.. ఈ మూడింట్లో నెట్ రన్ రేట్ పరంగా న్యూజిలాండ్ ముందుంది. కాబట్టి కివీస్ ఎలా గెలిచినా ముందంజ వేసే అవకాశాలు ఉంటాయి.
లంక గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి
ఇది లంకకు కూడా ప్రతిష్ఠాత్మక మ్యాచే కావడం విశేషం. రెండు విజయాలు, 6 ఓటములతో కేవలం 4 పాయింట్లతో ఉన్న లంకేయులు.. పాయింట్స్ టేబుల్ లో 9వ ప్లేస్ లో నిలిచారు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ నెగ్గడం తప్పనిసరి(Mandatory). ఈ వరల్డ్ కప్ లో వరుసగా ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లే ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా వెళ్తాయి. లేదంటే క్వాలిఫయింగ్ మ్యాచ్ లు ఆడాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ గెలిస్తే లంక మరో 2 పాయింట్లు సాధించడంతోపాటు ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ను వెనక్కు పంపి ఏడో ప్లేస్ దక్కించుకుంటుంది. పాకిస్థాన్ పై ఇంగ్లండ్ గెలిచినా ఆ జట్టూ 6 పాయింట్లతో ఉంటుంది. రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉన్న ఇంగ్లండ్ గెలిస్తే 7వ స్థానానికి చేరుకుని లంకను ఎనిమిదో ప్లేస్ కు పంపుతుంది. లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్ కాబట్టి లంక గెలవడం తప్పనిసరి. అలా జరగకపోతే బంగ్లా, నెదర్లాండ్స్ జట్లకు ముందంజ వేసే అవకాశాలుంటాయి. అందుకే ఈ మ్యాచ్ న్యూజిలాండ్ కు ఎంత ఇంపార్టెంటో లంకకూ అంతే ముఖ్యం.