అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద వందలాది కోట్ల రూపాయలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఎవరికి వారే వ్యక్తిగతంగా తమ ఎన్నికల అఫిడవిట్ల(Affidavit)లో తెలియజేశారు. ఇందులో టాప్-10లో నిలిచిన అభ్యర్థుల్ని పరిశీలిస్తే రూ.4,135 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. మూడు పార్టీల(BRS, కాంగ్రెస్, BJP)కి చెందిన టాప్-10 అభ్యర్థుల ఆదాయమే ఈ తీరుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలిచిన అభ్యర్థుల ఆస్తులు BRS కంటే ఎక్కువగా ఉన్నాయి. తొలి 10 మంది కాంగ్రెస్ అభ్యర్థులను చూస్తే వారి మొత్తం ఆస్తులు రూ.2,000 కోట్లకు పైగా ఉండగా.. BRSకు చెందిన నేతల వద్ద రూ.1,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ విషయంలో BJP రూ.500 కోట్లకు పైగా ఆస్తులతో థర్డ్ ప్లేస్ లో ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థుల్ని పరిశీలిస్తే… చెన్నూర్ నుంచి బరిలోకి దిగిన జి.వివేక్ వద్ద రూ.606.67 కోట్లు, మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వద్ద రూ.458.39 కోట్లు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రూ.433.93 కోట్లు, బెల్లంపల్లి నుంచి పోటీకి దిగిన జి.వినోద్ వద్ద రూ.197.12 కోట్లు, శేరిలింగంపల్లి అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ వద్ద రూ.124.49 కోట్లు ఉన్నాయి.
BRS అభ్యర్థుల్ని చూస్తే… భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి వద్ద రూ.227.51 కోట్లు, దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి రూ.197.40 కోట్లు, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు రూ.124.24 కోట్లు, నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డికి రూ.112.33 కోట్లు, నారాయణపేట అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డికి రూ.111.42 కోట్లు ఉన్నాయి. ఇక BJP నుంచి… శేరిలింగంపల్లి అభ్యర్థి ఎం.రవికుమార్ కు రూ.166.93 కోట్లు, కోరుట్ల నుంచి పోటీ చేస్తున్న ధర్మపురి అర్వింద్ కు రూ.107.43 కోట్లు, హుజూరాబాద్, గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు రూ.53.94 కోట్లు, సనత్ నగర్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డికి రూ.51.14 కోట్లు, కామారెడ్డి అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డికి రూ.49.71 కోట్లు ఉన్నట్లు వారు అందజేసిన అఫిడవిట్లలో తెలియజేశారు.