
భారతీయ జనతాపార్టీ పోరాట కమిటీ ఛైర్మన్ అయిన విజయశాంతి పార్టీ మారబోతున్నారు. ఈ విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(PCC) ఉపాధ్యక్షుడు మల్లు రవి స్వయంగా బయటపెట్టారు. కాంగ్రెస్ గూటికి విజయశాంతి రానున్నారని, ఒకట్రెండు రోజుల్లోనే ఆమె చేరిక ఉంటుందని తెలిపారు. కమలం పార్టీ తీరుపై ఆమె చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నా మౌనంగానే ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు BJP హైకమాండ్.. విజయశాంతికి పోరాట కమిటీ ఛైర్మన్ అప్పగించింది. కానీ గత ఆరు నెలలుగా పార్టీలో అయోమయ(Confusion) వాతావరణం ఏర్పడటంతో ఈ సినీ నటి ప్రతి కార్యక్రమానికి దూరంగానే ఉంటున్నారు.
BJP స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన నల్గొండ జిల్లా మునుగోడు నుంచి పోటీలో ఉన్నారు. అటు మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్ అయిన జి.వివేక్ సైతం నాలుగు రోజుల క్రితం సొంత గూటికి చేరిపోయారు. మరోవైపు జితేందర్ రెడ్డి అయితే తన తనయుడి ప్రచారానికే టైమ్ కేటాయిస్తున్నారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల్లో ఇపుడున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ మాత్రమే కీలక సేవలు అందిస్తున్నారు. ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో విజయశాంతి పార్టీ మార్పు విషయం చర్చనీయాంశంగా మారింది.