కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వాకం వల్ల మునుగోడుతోపాటు రాష్ట్రం మొత్తం రెండు, మూడు నెలల పాటు అభివృద్ధి(Development)కి దూరంగా ఉండాల్సి వచ్చిందని మంత్రి KT రామారావు అన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి BJPలోకి ఎందుకు వెళ్లారో.. తిరిగి సొంతగూటికి ఎందుకు చేరుకున్నారో అర్థం కాలేదని విమర్శించారు. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి.. కాంగ్రెస్ నుంచి కేటీఆర్ సమక్షంలో BRSలో చేరారు. ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం సాధారణమని, కానీ మునుగోడులో బై ఎలక్షన్స్ తో విచిత్రమైన పరిస్థితిని చూశామని KTR అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఉప ఎన్నిక తెచ్చిండో అర్థం కాలేదని, రెండు మూడు నెలల పాటు పరిపాలనను అస్తవ్యస్థం చేశారని విమర్శించారు.
2014లో స్వతంత్రురాలిగా…
2014లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన పాల్వాయి స్రవంతి.. గత ఉప ఎన్నికల్లో ఆమె మునుగోడు నుంచి బరిలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో ఆమెకు పోటీ చేసే ఛాన్స్ దక్కింది. ఆ ఉప ఎన్నికల్లో 23,000కు పైగా ఓట్లు రావడంతో ఈసారి సైతం టికెట్ తనదేనని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం, మునుగోడు నుంచే ఆయన పోటీకి దిగడంతో స్రవంతికి మొండిచెయ్యి ఎదురైంది. దీంతో ఆమె గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు.