వరల్డ్ కప్ లో భారత్-న్యూజిలాండ్(India Vs New Zealand) సెమీఫైనల్ పోరు(Semi Final Match)తో ఈ రోజు నుంచి అసలు సమరం మొదలవబోతున్నది. గత ప్రపంచకప్ లో ఇదే న్యూజిలాండ్ పై ఓటమి పాలైన టీమిండియా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం దొరికింది. ఈ వరల్డ్ కప్ లో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఒక్క ఓటమి లేకుండా సాగించిన విజయపరంపరతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నది. ముఖ్యంగా టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు దుమ్మురేపుతుండగా, బౌలింగ్ దళం ఆశించిన దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయింది. దీంతో భారత్ ఈసారి కప్పు గెలుస్తుందన్న అంచనాలు మరింత పెరిగాయి. అటు న్యూజిలాండ్ సైతం అపసోపాలు పడి సెమీస్ చేరుకోగా.. ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ముంబయి వాంఖడే స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారే అవకాశముందని ఇప్పటికే తేల్చారు.
ఈ స్టేడియంలో భారత్ 21 మ్యాచ్ లాడితే అందులో 12 గెలిచి, తొమ్మిదింటిలో పరాజయం పాలైంది. వన్డే ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు 9 సార్లు తలపడితే అందులో భారత్ 4, న్యూజిలాండ్ 5 మ్యాచ్ ల్లో గెలవగా.. మొన్నటి లీగ్ మ్యాచ్ లో కివీస్ పై మన జట్టుదే విజయం. వరల్డ్ కప్ లో ఈ ఇరు జట్లు సెమీస్ లో తలపడటం ఇది కంటిన్యూగా రెండోసారి. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.