ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా లోలోపల జరగాల్సినవి జరిగిపోతూనే ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ఇప్పటికే తాయిలాలు అందజేసేందుకు రెడీ చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ నెల 3 కన్నా ముందే ఎన్నికల తేదీల ప్రకటన వెలువడింది. దీంతో అప్పటి నుంచే రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో ప్రచారం జోరందుకుంది. ఆయా గ్రామాల్లోని లోకల్ లీడర్లు నజరానాలు ఇచ్చేందుకు ముందే సిద్ధం చేసుకున్నారు. ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి, ఉత్తర తెలంగాణలోని ఒక జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్న నేత.. ఇప్పటికే తన నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తలతో సమావేశాల్ని నిర్వహించారు. ఈయన నవంబరు 3 కన్నా ముందే ఒకసారి వారితో భేటీ కాగా.. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నాలుగు రోజులకు మరోసారి సమావేశమయ్యారు.
పోలింగ్ కు పెద్దయెత్తున జనాల్ని తీసుకురావడం, దూరప్రాంతాల్లో ఉన్న ఏ ఒక్కరూ ఓటుకు దూరం కాకుండా చూసుకోవాలంటూ ఇప్పటికే సూచనలిచ్చారు. ఇందులో భాగంగా తొలి దశలో ఊళ్లలో చీరలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఒక్కో చీర విలువ రూ.500 నుంచి రూ.700 దాకా ధర ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక పురుష ఓటర్లను ఆకర్షించేందుకు వాడవాడల్ని ఎంపిక చేసుకుని పార్టీలు ఇస్తున్నారు. ఇలా మహిళలు, పురుష ఓటర్లను ఆకర్షించేందుకు విభిన్న మార్గాల్లో ప్లాన్లు వేస్తూ పోలింగ్ తేదీ వచ్చే వరకు ఎవరూ జారిపోకుండా చూసుకుంటున్నారు. ఇక రెండో విడతలో మాత్రం నేరుగా నగదు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కో ఊరిలో జనాల్ని బట్టి ఒక ప్రధాన పార్టీ 70 నుంచి 80 శాతం మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గ్రామాల్లోని లీడర్లపై దృష్టి సారిస్తేనే…
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా భారీస్థాయిలో నగదు పట్టుబడింది. అయితే ఇవన్నీ వెహికిల్స్ చెకింగ్ లోనో లేదంటే ప్రత్యేకంగా సోదాలు చేస్తేనో దొరికిన నగదే. కానీ గ్రామాలపై దృష్టిసారిస్తే మరింత పెద్దయెత్తున తాయిలాలు బయటపడే అవకాశం ఉంటుంది. మారుమూల గ్రామాల్లో పెద్దగా నిఘా ఉండదు కాబట్టి.. చాపకింద నీరులా చల్లగా పని కానిచ్చేస్తున్నారు లోకల్ లీడర్లు. ఇప్పటిదాకా చీరలు పంచిన సదరు లీడర్లు ఇక ‘సారె(డబ్బు)’ పంచడానికి రెడీ అవుతున్నారు. ఇందుకు ఎలాంటి ఆన్ లైన్ ట్రాన్జాక్షన్స్ కాకుండా నేరుగా కవర్లలోనే నగదు ఇవ్వాలన్న నిర్ణయానికి ఇప్పటికే కొన్ని గ్రామాల్లోని పార్టీల నేతలు వచ్చినట్లు మాటలు వినపడుతున్నాయి.