లీగ్ దశలో భయంకరంగా ఆడుతుంది.. 400, 350 లేదా 300కు పైగా రన్స్ తో ప్రత్యర్థి టీమ్ లను బెంబేలెత్తిస్తుంది. కానీ సెమీస్ కు వచ్చేసరికి ఇది ఇప్పటిదాకా ఆడిన జట్టేనా అన్న అనుమానం కలిగేలా చేస్తుంది. ఎన్నో ఆశలతో సెమీఫైనల్ చేరుకున్న జట్టు కాస్తా.. అనూహ్యంగా ఓటమి పాలవుతుంది. ఇదీ… వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా పరిస్థితి. ఈసారీ దాని తీరు మారలేదు.. చివరకు ఆస్ట్రేలియా చేతిలో పరాభవం కొనితెచ్చుకుని ఇంటిముఖం పట్టింది. లీగ్ లో హిట్టు.. నాకౌట్ లో ఫట్టు అన్న మాట కరెక్ట్ గా సరిపోతుంది సఫారి జట్టుకు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. టార్గెట్ రీచ్ చేయడంలో ఇబ్బందులు పడ్డా చివరకు ఆసీస్ ఆటగాళ్లు ఎలాంటి కంగారూ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 రన్స్ చేసి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అనిశ్చితికి మారుపేరు
ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని సౌతాఫ్రికా.. ఈ మ్యాచ్ లోనూ అదే తీరును కనబర్చింది. 24 స్కోరుకే 4 వికెట్లు కోల్పోతే డేవిడ్ మిల్లర్(101; 116 బంతుల్లో 8×4, 5×6) ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. మధ్యలో క్లాసెన్(47) ఆదుకునే ప్రయత్నం చేసినా.. మిల్లర్ కు పూర్తిస్థాయిలో సహకరించే బ్యాటరే లేకుండా పోయాడు. నాలుగు సెంచరీల హీరో డికాక్(3), కెప్టెన్ బవుమా(0), వాండెర్ డసెన్(6), మార్ క్రమ్(10), జాన్సన్(0) టాప్ ఆర్డర్ అంతా వికెట్లు పారేసుకుంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ 3 వికెట్ల చొప్పున, ట్రావిస్ హెడ్, హేజిల్ వుడ్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.
టెన్షన్.. టెన్షన్..
ఆస్ట్రేలియా బ్యాటింగ్ చివర్లో టెన్షన్ ఏర్పడింది. ట్రావిస్ హెడ్(62), వార్నర్(29), స్మిత్(30) రాణించినా.. మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయలేదు. వరుసగా వికెట్లు పడుతుండటంతో చివర్లో సౌతాఫ్రికాకు ఆశలు కనిపించాయి. కానీ స్టార్క్, కమిన్స్ ఫినిషింగ్ టచ్ తో ఆ ఆశలు అడియాసలయ్యాయి. ఈ నెల 19న జరిగే ఫైనల్ లో భారత్ తో ఆస్ట్రేలియా తలపడనుంది.