దేశంలో మామూలు రోజుల్లోనే క్రికెట్ ఫీవర్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక వరల్డ్ కప్ లో అది ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదనాలి. అసలే ప్రపంచకప్ అయితే.. ఫైనల్ చేరింది భారత్.. ఇంతకంటే అపురూప సందర్భం ఏముంటుంది మరి. అందుకే ఇప్పుడు అహ్మదాబాద్ హాట్ హాట్ గా మారిపోయింది. లక్షా 20 వేల మంది పట్టే స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక ఇప్పుడు అక్కడ టికెట్ తీసుకున్నవాళ్లు మ్యాచ్ చూడాలంటే ఎన్నో అవస్థలు పడాల్సి వస్తోంది. లాడ్జికి వెళ్దామంటే వేలు, లక్షల్లో పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఒక్కో స్టార్ హోటల్ లో అఫీషియల్ గా ఒక రోజుకు రూ.2 లక్షల దాకా వసూలు చేస్తే అనధికారికంగా రూ.3-5 లక్షల దాకా ఉంటున్నట్లు అక్కడివారు అంటున్నారు. సాధారణ రోజుల్లో రూ.3-5 వేలు పలికే రూమ్ లు సైతం ఇప్పుడు రూ.20,000 దాకా పెరిగిపోయాయి.
హాస్పిటల్ లో బెడ్స్ బుక్ చేసుకుని..
మ్యాచ్ లు జరిగే సిటీలతోపాటు దానికి దగ్గర ఉన్న టౌన్లలోనూ లాడ్జ్ ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రేక్షకులు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. హాస్పిటల్ లో బెడ్స్ బుక్ చేసుకుని టెస్టులు చేయించుకునేందుకు గాను పేషెంట్లుగా చేరుతున్నారు. అలా ఒక్కో రోజుకు హాస్పిటల్ ను బట్టి రూ.1,500 నుంచి రూ.3,500 వరకు ఖర్చు చేస్తున్నారు. మరి లాడ్జిల్లో వేలకు వేలు బదులు ఇలా ఆస్పత్రుల్లో చెల్లించే బిల్లు తక్కువ ఉంటుంది కాబట్టి.. చాలా మంది ఈ ఆలోచనతో ఉంటున్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతున్నది. 50 వేల నుంచి 80 వేల మంది పట్టే స్టేడియాలున్న మన దేశంలో ఎంత లేదన్నా 5 నుంచి 10 వేలకు మంచి రూమ్స్ ఉండవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ బస(Stay) చేయాలంటే ఇలాంటి ఆలోచన రాకుండా ఎలా ఉంటుందని మరికొందరు అనుకుంటున్నారట.