Published 24 Nov 2023
భారత్ రాష్ట్ర సమితి(BRS).. కేసీఆర్ నేతృత్వంలోని ఈ పార్టీకి దేశంలోనే అత్యధిక విరాళాలు(Highest Donations) అందాయి. ఈ విషయాన్ని స్వయంగా ఎన్నికల సంఘమే వెల్లడించింది. 2022-23 సంవత్సరానికి గాను రూ.683.06 కోట్ల విరాళాలు అందగా అందులో ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో రూ.529 కోట్లు, ఫ్రుడెంట్(Frudent) ఎలక్టోరల్ ట్రస్టు నుంచి రూ.90 కోట్లు.. వ్యక్తులు, సంస్థల నుంచి రూ.64 కోట్లు అందినట్లు ECI(Election Commission Of India) తెలిపింది. ఈ ఏడాదికి గాను దేశంలోని పార్టీలకు అందిన విరాళాల వివరాల్ని ECI వెల్లడించింది. దేశవ్యాప్తంగా గల ప్రాంతీయ పార్టీల్లో BRS ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక రెండో స్థానాన్ని MK స్టాలిన్ నేతృత్వంలోని DMK దక్కించుకుంది. ఆ పార్టీకి రూ.192 కోట్ల మేర నిధులు అందగా.. మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన పార్టీల విరాళాల్లో అంతరం భారీగా ఉంది. YS జగన్ ఆధ్వర్యంలోని YSRCPకి కేవలం రూ.68 కోట్లు వచ్చాయి.
పార్టీ నాయకుల నుంచే
BRSకు పోగైన విరాళాల్లో ఆ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు, వారి కుటుంబాలకు చెందినవారి నుంచి వచ్చిన నిధులే ఎక్కువగా ఉన్నాయి. మంత్రులు గంగుల కమలాకర్ రూ.10 కోట్లు, మల్లారెడ్డి రూ.2.75 కోట్లు, మల్లారెడ్డి సతీమణి కల్పన రూ.2.25 కోట్లు, పువ్వాడ అజయ్ కుమార్ వదిన జయశ్రీకి చెందిన హన్ష పవర్ అండ్ ఇన్ ఫ్రా నుంచి రూ.10 కోట్లు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్ నుంచి రూ.10 కోట్లు, MLC పి.వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ నుంచి రూ.10 కోట్లు అందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పార్టీ ఆవిర్భవించిన రెండు దశాబ్దాల కాలంలోనే ఈ స్థాయిలో విరాళాలు పొంది BRS రికార్డు సృష్టించింది. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీల్లో తనకు సాటిలేదు అని మరోసారి నిరూపించుకుంది.