Published 24 Nov 2023
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు(Reservations) అమలు చేస్తున్నారని, BJP అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థుల ప్రచారం(Election Campaign)లో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. రాత్రికి హైదరాబాద్ అంబర్ పేట్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. కేంద్రం తీసుకురాబోతున్న పసుపు బోర్డు(Turmeric Board)తో ఇక్కడి రైతులకు పెద్దయెత్తున మేలు జరగనుందని గుర్తు చేశారు. పసుపును ఎగుమతి చేయడంతోపాటు పరిశోధనలు చేయడానికి వీలు కలుగుతుందన్నారు. బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నందున వారి కోసం నిజామాబాద్ లో హాస్పిటల్ అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
లీకేజీ నిందితుల్ని జైలుకు పంపుతాం
గల్ఫ్ బాట పట్టిన లక్షలాది మంది కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. వలస వెళ్లే కార్మికుల కోసం NRI మంత్రిత్వ శాఖ దృష్టిసారించిందన్నారు. ఇచ్చిన హామీలను KCR నిలబెట్టుకోలేదని, KTR మాత్రం కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని షా విమర్శించారు. పేపర్ లీకేజీ నిందితులను కచ్చితంగా జైలు పంపిస్తామని భరోసా ఇచ్చారు.