Published 27 Nov 2023
ఇప్పటిదాకా ఎన్నికల ప్రచారంలో ఈ పార్టీ ఆ పార్టీకి B టీమ్ అని.. ఆ పార్టీ ఈ పార్టీకి C టీమ్ అంటూ మూడు పార్టీలు విమర్శలు చేసుకోవడం చూశాం. కానీ ఇప్పుడు సరికొత్త పల్లవి అందుకునేలా ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయం తీసుకుంది. రైతుబంధు చెల్లింపుల్ని ఆపేయాలనడంతో అధికార BRSకు ఒక రకంగా షాక్ తగిలినట్లయింది. ఇక మూడు పార్టీలకు బదులు ఇప్పుడు రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. రైతు బంధు ఆపిన పాపం మీదంటే మీదంటూ అప్పుడే విమర్శలు స్టార్ట్ చేసుకున్నారు. నెపం ఎక్కడ తమ మీదకు వస్తుందన్న ఉద్దేశమో ఏమో కానీ BRS, కాంగ్రెస్ పరస్పర వాగ్వాదానికి దిగుతున్నాయి. రైతు బంధు చెల్లింపులకు ఎలా పర్మిషన్ ఇస్తారంటూ నిన్నటి వరకు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఏకంగా ఎన్నికల సంఘాన్నే లక్ష్యంగా చేసుకుని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలపై మంత్రి హరీశ్ రావుతోపాటు ఆ పార్టీ పెద్దలంతా ఎదురుదాడికి దిగారు.
ఇరుపార్టీల లీడర్ల ఎదురుదాడి
ఇలా రెండు పార్టీల మధ్య ప్రధానాంశంగా తయారైన రైతు బంధు నిధుల విషయంలో ఎన్నికల సంఘం యూటర్న్ తీసుకోవడంతో.. ఆ రెండు పార్టీలు కాస్తా ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తోంది. మంత్రి హరీశ్ రావు వల్లే రైతు బంధు ఆగిపోవాల్సి వచ్చిందని, దీనివల్ల ఓట్లు దండుకోవాలన్న ఆత్రుత తప్ప ఇంకోటి కాదని రేవంత్ అంటుంటే.. కావాలనే కాంగ్రెస్ పార్టీ ఆపిందని హరీశ్ రావు, KTR, కవిత ఎదురుదాడికి దిగారు.
నిజంగానే ప్రభావం చూపుతుందా..
రైతుబంధు చెల్లింపులు ఆగిపోవడం నిజంగానే పార్టీలపై ప్రభావం చూపిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇపుడిస్తే యాసంగి పంటకు పెట్టుబడి దక్కేది. అక్టోబరు నుంచే యాసంగి పంటకు రైతులు రెడీ అవడంతో ఇప్పటికే డబ్బులు పడాల్సింది. కానీ రైతుబంధు చెల్లింపులో BRS సర్కారు వేచిచూసే ధోరణితోనే ఉండిపోయింది. ముందే నోటిఫికేషన్ వస్తుందని తెలిసినా ఆ నిధుల్ని అకౌంట్లలో వేయలేకపోయింది. చివరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతా దాన్ని సాధించుకున్నా.. తుదకు ఫలితం లేకుండా పోయింది. లేట్ అయినా డబ్బుల్ని వేస్తే ఓట్లు బాగా పడే అవకాశముంటుందని కేసీఆర్ సర్కారు భావించింది. కానీ కాంగ్రెస్ కంప్లయింట్ తో ఆ పార్టీకి చుక్కెదురైంది. ఈ స్కీమ్ ను ఆపడంలో సక్సెస్ అయిన హస్తం పార్టీ.. నెపం తమ మీద పడకుండా ఆత్మరక్షణతో ఉంది. అందుకే అందరికన్నా ముందు రేవంతే రియాక్ట్ అయ్యారు. కావాలనే ఆపించారన్న అపవాదుతో తమకు ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళనా కాంగ్రెస్ లో కనిపించింది. రెండు పార్టీలు భుజాలు తడుముకుంటున్న వేళ మరి రైతులు ఓటింగ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.