Published 27 Nov 2023
ఇంతకుముందు హుజూరాబాద్ ప్రజలు ఫాంహౌజ్ సీఎంకు ట్రైలర్ చూపించారని, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సినిమా చూపిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మొదటిసారి తెలంగాణ BJP ప్రభుత్వం ఏర్పడుతుందంటూ మోదీ తెలుగులో సంబోధించారు. ప్రచారంలో భాగంగా మహబూబాబాద్, కరీంనగర్ సభలకు హాజరైన ప్రధాని.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. KCR తన మూఢనమ్మకాలతో ప్రజాధనం వృథా చేశారని, అలాంటి అపనమ్మకాలున్న CM మనకు అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ గుడ్డి విశ్వాసాలతో సచివాలయాన్ని(Secretariat)ను కూల్చేశారని, BRS అవినీతిపరులను జైలుకు పంపకుండా వదిలేది లేదని స్పష్టం చేశారు.
వచ్చే ఐదేళ్లు కీలకం
నూతన రాష్ట్రం తెలంగాణకు పదేళ్లు అని అయితే వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమని, ఈ సమయాన్ని వృథా చేయవద్దని ప్రజలను మోదీ కోరారు. రాష్ట్రంలో బీజేపీ తొలి సీఎం బీసీనే అవుతారు అని మరోసారి తెలియజేశారు. కుటుంబ పార్టీలు వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నాయని, BRSను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మి ఓటు వేయొద్దని కోరారు.