
భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠకు మారుపేరు. ఇరుదేశాల అభిమానులు యుద్ధంలా భావించే దాయాదుల పోరుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అక్టోబరు-నవంబరులో మన దేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం ఇప్పట్నుంచే జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో మ్యాచ్ లు జరగనుండటంతో… ఆటతోపాటు ప్లేయర్స్ ను డైరెక్ట్ గా చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. ఈ మెగా టోర్నీలో భాగంగా జరిగే దాయాదుల పోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు ఉండే పోటీయే వేరు. అక్టోబరు 15న జరిగే అహ్మదాబాద్ మ్యాచ్ కు అప్పుడే విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అక్కడ హో టల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్క రోజు కోసం రూ.50 వేలకు పైగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. మెయిన్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో భారత్ మ్యాచ్ లు ఆడుతున్న నగరాల్లో హోటళ్లకు పెద్దగా గిరాకీ లేకున్నా భారత్-పాక్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లోనే అనూహ్య డిమాండ్ ఏర్పడింది.

క్రికెట్ ను విపరీతంగా ప్రేమించే మనదేశంలో భారత్-పాక్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు మరి. అందుకే అహ్మదాబాద్ లో హోటల్ బుకింగ్ లు జోరందుకుంటున్నాయి. హోటళ్ల అద్దెలు ఇంచుమించు 10 రెట్లు ఎక్కువగా పెరిగినట్లు అక్కడివారు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.5,000 నుంచి హయ్యెస్ట్ రూ.10,000 వరకు ఉండే ధరలు… ప్రస్తుతం 5 నుంచి 10 రెట్ల వరకు ఎక్కువగా వసూళ్లు చేస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఇక్కడివారే కాకుండా ఇతర దేశాల నుంచి మ్యాచ్ ను చూసేందుకు పెద్దసంఖ్యలో వస్తుండటంతో… ధరల్ని హోటల్ మేనేజ్ మెంట్స్ ఉన్నట్టుండి భారీగా పెంచేశాయి. దీంతో సాధారణ క్రికెట్ అభిమాని… అక్టోబరు 15న జరిగే భారత్-పాక్ పోరును అక్కడే ఉండి చూసే అవకాశం లేకుండా పోతోంది.