
Published 29 Nov 2023
ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. పోలింగ్ కోసం రెండు రోజుల పాటు డ్యూటీలో ఉండేందుకు అన్నింటినీ వదులుకుని వచ్చే సిబ్బందికి.. లోకల్ అధికారుల వల్ల అవస్థలు తప్పడం లేదు. ఏ ఒక్క ఉద్యోగి ఇబ్బందులు పడకూడదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేస్తున్నా స్థానిక అధికారుల చెవికెక్కడం లేదు. ఎంతో దూరం నుంచి వచ్చిన సిబ్బందికి మధ్యాహ్న భోజనం(Lunch) కూడా ఏర్పాటు చేయలేని దురవస్థ ఏర్పడింది. దీంతో జనగామ DRC కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. లంచ్ కూడా ఏర్పాటు చేయకపోవడమేంటంటూ ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి పోలింగ్ కోసం ఈ రోజే మెటీరియల్ తీసుకుని ఆయా పోలింగ్ స్టేషన్ లకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. EVM, ఇంక్, ఇతర సామగ్రి అన్నీ కలిపి చూసుకునే సరికి సాయంత్రం అవుతుంది. పొద్దున ఏడెనిమిది గంటలకు బయల్దేరి 11 గంటలకు DRC సెంటర్లకు చేరుకునే సిబ్బందికి లంచ్ ఏర్పాటు చేయాలి. ఉదయం అల్పాహారం(Tiffin) చేసినా, చేయకున్నా ఠంచనుగా డ్యూటీకి రావాల్సిందే.
ఇదేం పద్ధతి…
అలాంటి ఉద్యోగులకు లంచ్ కూడా ఏర్పాటు చేయకపోవడం వంటి స్థానిక అధికారుల తప్పిదంతో ఎన్నికల సంఘానికి అపవాదు వస్తున్నది. చివరకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిందంతా జరిగిపోవడంతో ప్రతీసారి ఈ తిప్పలు తప్పడం లేదు. పోలింగ్ కు ముందు రోజు కూడా బస చేసేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో గత ఎన్నికల సమయంలో కరెంటు, నీళ్లు లేక చీకట్లోనే కొంతమందికి కాలం గడపాల్సి వచ్చింది. నిజానికి పోలింగ్ స్టేషన్లకు అయ్యే ఖర్చంతా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ROలు కేటాయించాలి. ఇందుకు గాను ROలకు ముందుగానే అడ్వాన్స్ డబ్బులు అందుతాయి. ఆ డబ్బులతో మండలాల్లోని AROలు పర్యవేక్షించి అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత.. ఖర్చులకు సంబంధించిన బిల్లుల్ని పంపాలి. రూల్స్ ఇలా ఉంటే గ్రౌండ్ లెవెల్ అధికారుల వ్యవహారశైలితో ఎలక్షన్ కమిషన్ కు కొందరు చెడ్డపేరు తెస్తున్నారు. పోలింగ్ స్టేషన్లలోనే ఇలాంటి పరిస్థితులు ఇప్పటిదాకా కనిపించగా.. ఇప్పుడు ఏకంగా DRCలోనే భోజనం దొరకకపోవడం విడ్డూరంగా మారింది.