Published 29 Nov 2023
భారత క్రికెట్(Indian Cricket) జట్టు కోచ్ పోస్టుకు ఉండే పోటీ, ఒత్తిడి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆ పదవిని దక్కించుకోవడం ఒకెత్తయితే దాన్ని ఎక్కువ కాలం కాపాడుకోవటం మరో ఎత్తు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఎత్తుగడలు, ఆటగాళ్ల మధ్య సఖ్యత, యువ ఆటగాళ్లను సానబెట్టడం వంటి కీలక బాధ్యతలన్నీ మెయిన్ కోచ్ కు ఉంటాయి. అందుకే ఆ పోస్టుకు దేశ, విదేశాల నుంచి భారీగా అప్లికేషన్లు వస్తాయి. అంతటి సమర్థత గల వ్యక్తిగా పేరున్న రాహుల్ ద్రవిడే మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నాడు. మొన్న జరిగిన ప్రపంచకప్(World Cup) వరకు ద్రవిడ్ కోచ్ గా ఉండగా.. ఆయన పదవీకాలం(Term) పూర్తి కావడంతో మళ్లీ ఆ పోస్ట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ కనపడింది. కానీ దానికి తెరదించుతూ BCCI.. మరోసారి రాహుల్ ద్రవిడ్ కే బాధ్యతలు కట్టబెట్టింది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఒప్పందం ప్రకారం బాధ్యతల నుంచి రాహుల్ వైదొలగడంతో.. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు వీవీఎస్ లక్ష్మణ్ ను తాత్కాలిక కోచ్ గా నియమించారు.
వచ్చే వరల్డ్ కప్ దాకా
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. అప్పటిదాకా రాహుల్ నే కోచ్ గా నియమిస్తున్నట్లు BCCI ప్రకటించింది. అపార అనుభవశాలి అయిన ఈ మాజీ ప్లేయర్.. జూనియర్ జట్ల కోచ్ గా, NCA(National Cricket Academy) ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం భారత ప్రధాన జట్టుతోపాటు టీ20, అండర్-19 టీమ్ లకు ఆడుతున్న యువ కిశోరాలందర్నీ గుర్తించిన ఘనత ద్రవిడ్ కు దక్కుతుంది. ఆటగాడిలాగే విధుల్లోనూ నిక్కచ్చిగా వ్యవహరించే ద్రవిడ్ నేతృత్వంలోనే మొన్నటి వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు జట్టు ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోలేదు. అతనిపై పూర్తి నమ్మకం ఉంచిన భారత క్రికెట్ బోర్డు.. పదవీకాలాన్ని పొడిగిస్తూ డిసిషన్ తీసుకుంది.