Published 29 Nov 2023
ప్రాణాలు ఉంటాయో, పోతాయోనన్న విపత్కర పరిస్థితుల్లోనూ తమను దృఢంగా ఉంచింది యోగా, మార్నింగ్ వాక్ అని ఉత్తరాఖండ్ సొరంగం(Uttarakhand Tunnel) బాధితులు అన్నారు. మమ్మల్ని కాపాడేందుకు దేశం మొత్తం ప్రయత్నించింది.. మార్నింగ్ వాక్, యోగాతో మేం అందరం మనోస్థైర్యంతో ఉండగలిగాం.. అని తెలిపారు. ఉత్తర కాశీలోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మందిని నిన్న బయటకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ కూలీలందరితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతోపాటు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ప్రధాని తమతో స్వయంగా మాట్లాడటం మరింత ఓదార్పునిచ్చిందని బాధితులు అంటున్నారు.
‘సొరంగంలో చిక్కుకుపోయినా మేం చాలా ధైర్యంగా ఉన్నాం.. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నవారిని ప్రభుత్వం కాపాడింది.. దేశంలో ఉన్న మమ్మల్ని కాపడదా అనుకుంటూ పూర్తి ధైర్యంతో ఉన్నాం’.. అని బాధితులంతా ప్రధానికి విషయాల్ని తెలియజేశారు. ‘మొదట కొన్ని గంటల పాటు టెన్షన్ పడ్డాం.. కానీ మాతో అధికారులు కాంటాక్ట్ అయిన తర్వాత ధైర్యం వచ్చింది.. మేం ఆరోగ్యంగా ఉంటూ సొరంగంలో ఉన్నన్ని రోజులూ నమ్మకాన్ని కోల్పోలేదు.. మమ్మల్ని కాపాడిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ ప్రధానితో ఆనాటి అనుభవాల్ని పంచుకున్నారు. 41 మంది కార్మికుల ఆరోగ్యం బాగుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. సొరంగం నుంచి బయటపడిన తర్వాత అన్ని రకాల పరీక్షలు చేయగా, అవసరమైతే అందర్నీ డెహ్రాడూన్ లోని AIIMSకు తరలించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.