Published 29 Nov 2023
అధికార BRS, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య ఫిర్యాదుల మంట కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి KTRపై ఎన్నికల సంఘం(EC)కి కాంగ్రెస్ పార్టీ కంప్లయింట్ ఇచ్చింది. పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ ను నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు మల్లు రవి, నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. CEO వికాస్ రాజ్ ను కలిసి మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడ రక్తదానం చేయడాన్ని కూడా ప్రస్తావించారు. దీక్షాదివస్ పేరిట KTR రూల్స్ ను ఉల్లంఘించారని, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పోలీసులు చూడగలరా అంటూ నిరంజన్ ప్రశ్నించారు.
ఎలక్షన్ స్క్వాడ్ అభ్యంతరం
తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ నిర్వహించడంపై అంతకుముందు ఎలక్షన్ స్క్వాడ్ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఇది ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించినా అది ప్రచారం కిందకే వస్తుందంటూ తెలంగాణ భవన్ కు చేరుకున్న ఎలక్షన్ స్క్వాడ్ స్పష్టం చేసింది. అయితే తమ పార్టీ ఆఫీసులో కార్యక్రమం చేసుకుంటే అది తప్పెలా అవుతుందని మంత్రితోపాటు ఆయన అనుచరులు ప్రశ్నించారు. ఇలా ఇరువర్గాల మధ్య ఈ అంశం వివాదాస్పదంగా మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ లీడర్లు ఈసీకి కంప్లయింట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మార్చింది.