Published 29 Nov 2023
డబ్బులిచ్చి ఓట్లు కొనే పార్టీలున్నంత కాలం తాము మారేదే లేదంటూ డిసైడ్ అయినట్టున్నారు ఓటర్లు. నగదు తమ వరకు రాకపోతే నిరాశ వ్యక్తం చేసే స్థాయి నుంచి ఏకంగా రోడ్డెక్కే స్థితికి చేరుకుంది. కాలనీలోని మహిళలు రోడ్డెక్కడంతోపాటు ఏకంగా MLA క్యాంపు కార్యాలయాన్నే ముట్టడించారంటే పరిస్థితి ఎంతదాకా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ వింత చోటుచేసుకుంది. నగదు పంపిణీలో వివాదం జరగడంతో ఏకంగా కాలనీ మహిళలంతా MLA ఆఫీసుకు చేరుకున్నారు. మిర్యాలగూడ 39వ వార్డులోని సుందరయ్య నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. BRS లీడర్లు కొందరికే డబ్బులు ఇచ్చారన్న కోపంతో డైరెక్ట్ గా రోడ్డెక్కారు. తమ కాలనీలో నగదు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్న మహిళలు MLA క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది.
సీఎం ఇలాకాలోనూ అదే తీరు
అటు ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దిగిన కామారెడ్డి నియోజకవర్గంలోనూ మిర్యాలగూడ పరిస్థితే కనిపించింది. భిక్కనూరులో పలువురు మహిళలు డబ్బులు రాలేదంటూ రోడ్డుపైకి రాగా.. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు కూర్చున్నారు.