Published 30 Nov 2023
హెచ్1బీ వీసాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏటా లక్షల మంది అప్లయ్ చేసుకుంటే అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అవకాశమది. అయితే అమెరికా(Uninted States)లో ఉండే భారతీయులకు బైడెన్ సర్కారు తీపి కబురు చెప్పింది. హెచ్1బీ విధానాన్ని మరింత సరళీకరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల హెచ్1బీ వీసాలను ఇక నుంచి అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ డిసిషన్ తీసుకుంది. ఇందుకోసం డిసెంబరులో ఓ పైలట్ ప్రోగ్రామ్(Domestic Work Visa Renual)ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ పైలట్ ప్రోగ్రాం డిసెంబరు నుంచి మూడు నెలల పాటు అందుబాటులోకి రానుండగా.. దీని కింద మొదటగా 20 వేల మందికి వీసా రెన్యువల్ చేయనున్నట్లు అక్కడి సర్కారు తెలిపింది.
స్వదేశాలకు అవసరం లేకుండానే
]హెచ్1బీ వీసా రెన్యువల్ చేసుకోవాలంటే భారతీయులంతా ఇప్పటివరకు స్వదేశానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అమెరికా తాజా నిర్ణయంతో మన దేశ వాసులు వీసా రెన్యువల్ కు భారత్ కు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. హెచ్1బీ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున వీలైనంత ఎక్కువ మందికి అపాయింట్ మెంట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ గా 20 వేల మందికి అవకాశం కల్పిస్తే అందులో ఎక్కువగా భారతీయులే ఉంటారని అమెరికా అంటున్నది. రానున్న రోజుల్లో రెన్యువల్ ను పెంచుకుంటూ పోనుండగా, దీనివల్ల భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయాలపై పని భారం తగ్గడంతోపాటు కొత్త వీసా అప్లికేషన్ల ప్రాసెస్ పై దృష్టిపెట్టే అవకాశం కలుగుతుంది. ఈ విధానానికి సంబంధించి త్వరలోనే వివరాల్ని తెలియజేయనున్నారు.
విద్యార్థి వీసాలకు నయా రూల్స్
విదేశీ నిపుణుల పేరిట జారీ చేసే హెచ్1బీ వీసాల కోసం మన దేశంలో విపరీతమైన డిమాండ్ ఉండగా.. దాని రెన్యువల్, స్టాంపింగ్ కోసం స్వదేశాలకు వెళ్లడమనేది 2004 నుంచే స్టార్ట్ అయింది. రెన్యువల్ కోసం US కాన్సులేట్లలో నెలల పాటు ఎదురుచూడాల్సి వస్తున్నది. ఇలాంటి ఇబ్బందులున్న దృష్ట్యా ఇక పాత సిస్టమ్ కు తెరపడనుంది. ఇక గత సంవత్సరం 1,40,000 మందికి వీసాలు జారీ చేసిన అమెరికా… ఈసారి వాటి సంఖ్య మరింత పెంచబోతున్నట్లు తెలిపింది.